టీడీపీ బీజేపీ పొత్తు కన్ఫర్మ్.... అర్ధమైపోయిందా..?

Update: 2022-08-23 02:30 GMT
ఏపీలో కీలక రాజకీయ పరిణామం  ఏదో జరుగుతుందని వైసీపీకి అర్ధం అవుతోందా. ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోని వైసీపీకి ఇపుడే ఉలికిపాటు కలుగుతోందా అంటే వేగంగా మారుతున్న పరిణామాలు జరుగుతున్న సంఘటనలు చూస్తే అవే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోడీ అమిత్ షా ద్వయంలో అమిత్ షా స్వయాన మీడియా దిగ్గజం రామోజీరావు దగ్గరకు రావడం అంటే ఇంతకంటే రాజకీయ కీలకం వేరేది ఉండబోదు అంటున్నారు.

ఇక రామోజీరావుతో అమిత్ షా భేటీ తరువాత వైసీపీలో ఏ కాస్తా అయిన అనుమానాలుగా ఉన్నవి ఏపీలో రాజకీయం పూర్తిగా మారుతోంది అని అర్ధమైందా అన్న డౌట్లు వస్తున్నాయి. చివరాఖరుగా దీని మీద ఏమైనా డౌట్లు ఉంటే తేల్చుకోవాలనే జగన్ ఢిల్లీకి వెళ్లారా అన్న చర్చ ఉంది. జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.

ప్రధానితో భేటీ అరగంట పాటు జరిగింది. సమస్యలు అన్నీ ప్రస్థావించారు. సక్సెస్ ఫుల్ గా ప్రధానితో భేటీ జరిగింది అని చెప్పుకున్నా కూడా వైసీపీ వారికి రావాల్సిన అసలు జవాబు వచ్చేసిందా  అనే అంటున్నారు. బీజేపీ పెద్దలు పెదవి విప్పకుండానే  తెలుగు రాష్ట్రాలలో తమ రూట్  మ్యాప్ ఏంటో చెప్పేశారనే అంటున్నారు.

అందుకే వైసీపీలో కీలక నాయకుడు జగన్ కి కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి లేటెస్ట్ గా వేసిన ఒక ట్వీట్ లో  అయితే ఏపీ రాజకీయాల్లో రేపటి రోజున ఏమి జరగబోతోందో కూడా చెప్పారని అంటున్నారు. చంద్రబాబు బీజేపీని చేరదీస్తుందా  లేదా అన్నది బీజేపీ అంతర్గత విషయమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా  స్పందించారు. విలువల్లేని టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని టీడీపీ తన పరిస్థిితిని మరింత దిగజార్చుకుంటుందా లేదా  అన్నది ఆ పార్టీ నిర్ణయించుకోవాలని కూడా ఆయన అన్నారు.

అలాగే, విలువల్లేని టీడీపీతో పొత్తుతో బీజేపీ స్థాయి దిగజార్చుకుంటుందన్నారు. ఎవరైనా దరిద్రాన్ని  కోరి చంకన పెట్టుకుంటారా  అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అంటే ఏపీలో బీజేపీ టీడీపీల మధ్య కొత్త పొత్తు పొడుస్తోంది అన్నది పూర్తిగా వైసీపీ పెద్దలకు క్లారిఫై అయిపోయిన తరువాతనే ఈ రకంగా రియాక్షన్ వచ్చిందా అన్న చర్చ సాగుతోంది.

ఇక అమిత్ షా రామోజీరావుతో భేటీ తరువాత ఏపీలో మరికొన్ని పరిణామాలు జరిగాయి. బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే ఏపీలో సంచలన పరిణామాలు త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయని అంటున్నారు. అదే విధంగా ఈ మధ్య దాకా బీజేపీ గురించి పెద్దగా ప్రస్థావించని పవన్ కళ్యాణ్ కూడా తాజాగా  మంగళగిరిలోని మీడియా సమావేశంలో బీజేపీ మా మిత్ర పక్షం, మా భాగస్వామ్యం కొనసాగుతోందని గట్టిగా చెప్పడం విశేషం.

అంటే కేంద్ర స్థాయిలో జరిగే ప్రతీ పరిణామం జనసేనానికి కూడా బాగానే తెలుస్తున్నాయని అంటున్నారు. ఇక మరి కొద్ది రోజులలో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసిన తరువాత పొత్తులు మీద పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు. సో ఏపీలో కొత్త రాజకీయానికి తెర లేచింది అన్న మాటేగా.
Tags:    

Similar News