కదిరి బాబూరావు.. కథ మళ్లీ మొదటకు!

Update: 2019-03-20 04:13 GMT
ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి వీర ప్రయత్నాల్లో ఉన్న కదిరి బాబూరావు కథ ఇప్పుడు మళ్లీ మొదటకు వచ్చిందని స్పష్టం అవుతోంది. ఈయన కనిగిరి నుంచి టీడీపీ టికెట్ కోసం పట్టు పట్టాడు. అయితే ఈయన అక్కడ నుంచి నెగ్గే పరిస్థితి లేదని.. అందుకే ఈయనకు టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకే.. కనిగిరిలో కాంగ్రెస్ నుంచి బాబు నేతను దిగుమతి చేసుకున్నారు. ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి పచ్చ కండువా వేశారు.

అయితే టికెట్ విషయంలో మొదటి నుంచి బాబూరావు పేచీ పెడుతున్నాడు. వేరొకరిని అయితే బాబు అస్సలు లెక్క చేసే వారు కాదు. ఎటొచ్చీ కదిరి బాబూరావుకు బాలకృష్ణ ఆశీస్సులు ఉండటంతో ఆయన ఆటలు సాగుతూ ఉన్నాయి. బుజ్జగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు బాబు.

చివరకు కదిరిబాబూ రావు విషయంలో బాలకృష్ణ రంగంలోకి దిగాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయినట్టుంది. బాబూరావును దర్శికి పంపించారు చంద్రబాబు నాయుడు. కనిగిరిని మాత్రం ఉగ్రనరసింహారెడ్డికే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో అంతా సర్దుకుంది అనుకుంటుంటే.. బాబూరావు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నాడు.

తను దర్శి నుంచి పోటీ చేసేదే లేదని.. తను కనిగిరి నుంచినే పోటీలో ఉంటానంటూ ఆయన గోల పెడుతున్నాడని తెలుస్తోంది. దర్శి తనకు వద్దని తను కనిగిరి నుంచినే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కదిరి బాబూరావు అంటున్నారట. మరి ఇదంతా బెదిరింపు హెచ్చరికే అని చెప్పవచ్చు. బాబును బెదిరించడానికే ఆయన ఇలా చేస్తున్నాడని, చివరకు మొత్తం సర్దుకుంటుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Tags:    

Similar News