ఏమి సేతురా బాబు... ఏమీ సేతు!

Update: 2018-12-11 15:30 GMT
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు అది చేస్తారు... ఇది చేస్తారు అని ఆశించిన మహాకూటమి అభ్యర్దులందరూ ఇప్పుడు ఏమి సేతురా బాబు అని పాడుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించి రానున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఓడిస్తామని చంద్రబాబు తన ప్రచారంలో హోరెత్తించారు. ఇది నిజమే కాబోలు అని మహాకూటమి అభ్యర్దులు ఆనందపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రచారానికి వచ్చిన జనాలను చూసి ఇంకేంముంది తమదే గెలుపు అని కూడా నిర్ణయించుకున్నారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది.

చంద్రబాబు రాజకీయ మంత్రాలకు ఓట్ల చింతకాయలు రాలలేదు. దశాబ్దాల వైరం - కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఏర్పడిన తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టానని తెలుగు ప్రజలు విశ్వసించారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఓడించడం చారిత్రక అవసరం అంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై తెలుగు ప్రజలలో విశ్వసనీయత కనిపించలేదు.గతంలో చంద్రబాబు నాయుడి రాజకీయాలను ఎత్తులు, పైఎత్తులు గమనించిన తెలంగాణ ప్రజలు ఈ సారి ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేసారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిని తెలుసుకోలేకపోయిన మహాకూటమి అభ్యర్దులు తమ ఓటమి తర్వాత ఏమి సేతురా బాబు అంటూ పాటలు పాడుకోవడం మినహా మరేమి చేయ‌లేక‌పోతున్నారు.

కౌటింగ్ ప్రారంభమయ్యి రెండో రౌండ్ పూర్తికాకుండానే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన భవ్య ప్రసాద్ వంటి అభ్యర్దులు కౌటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయారు. ఇది మహాకూటమి అభ్యర్దులలో నైరాశ్యానికి నిదర్శనమని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలుపొందిన అభ్యర్దులకు వేలలో మెజారిటీ రావడం - ప్రజాకూటమి నుంచి గెలుపొందిన వారికి వందలలో మెజారిటీ రావడం మహాకూటమి నేతలు జీర్ణం చేసుకోలేక పోతున్నారు. ఇంత భారీ ఓటమికి కారణం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాలు మోపడమేనని అంటున్నారు. ఆయన రాక ఏమి సేతురా బాబు అనే శోకాన్ని మిగిల్చిందని ఓటమి పాలైన మహాకూటమి అభ్యర్దులు పాడుకుంటున్నారు.
Tags:    

Similar News