బాబు గారి పసందు హామీ...మందు బాబులు పడిపోతారా...?

Update: 2022-12-31 02:30 GMT
ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైపోతుంది. నిన్నటిదాకా విమర్శలు దూషణ పర్వంతో గడిపేసిన రాజకీయ పార్టీలు ఇపుడు హామీల పర్వానికి తెర తీస్తునారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే ఆసక్తికరమైన హామీ ఒకటి ఇచ్చిపడేశారు. బాబు నెల్లూరు జిల్లా కావలిలో మందుబాబులను అట్రాక్ట్ చేసేందుకు మత్తెక్కించే హామీ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే నాణ్యత కలిగిన మద్యాన్ని సరఫరా చేస్తామని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రాండెడ్ సరకు పేరున్న సరుకు కూడా తెచ్చి అమ్ముతామని చెప్పుకొచ్చారు. చూడడానికి ఇది వింత హామీగా ఉన్నా మందు ప్రియులకు ఇది భలే పసందు హామీ అని కూడా అంటున్నారు.

ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కొత్త రకం బ్రాండ్లు మార్కెట్ లో పెట్టారని విమర్శలు ఉన్నాయి. అదే విధంగా చీప్ గా లిక్కర్ ని మార్కెట్ లో పెట్టి దోచుకుంటున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాంటి మద్యం తాగి జనాలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అలా చాలా మంది చనిపోయారని ప్రతిపక్షం ఇప్పటికే విమర్శలు చేస్తూ వచ్చింది

ఇక మద్య నిషేధం హామీని కూడా జగన్ ఎన్నికల వేళ ఇచ్చారు. తీరా పవర్ లోకి వచ్చాక   దాన్ని మరచి మద్యం అమ్మకాలు పెంచేశారని, దాన్ని ఆదాయ వనరుగా చేసుకున్నారని కూడా విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇక మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులు పెడుతూ నల్లధనాన్ని వైసీపీ నేతలు పోగేసుకుంటున్నారు అని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తూ వచ్చారు.

కావలి సభలో చంద్రబాబు అయితే నగదు చెల్లింపులు రద్దు చెసి ఆన్ లైన్ చెల్లింపులు ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ఇక మద్యం దుకాణాలను అంచనా వేసి ఆ ఆదాయని కూడా ఆకట్టు పెట్టి మరీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణం పొందినట్లుగా చెబుతున్నారు

ఇలా మద్యం చుట్టూ ఏపీ రాజకీయం అల్లుకుని ఉంది. దాంతో చంద్రబాబు తెలివిగానే ఈ హామీ ఇచ్చారని అంటున్నారు. మద్యం ప్రియులకు ఈ హామీ చాలా ప్రియమైనదిగా కూడా చెబుతున్నారు. మద్య నిషేధం అంటే ఓట్లు రాలుతాయో లేదో కానీ మంచి బ్రాండ్స్ అంటే మాత్రం మద్యం అలవాటు ఉన్న వారు అంతా టర్న్ అవుతారు అని లెక్కలు వేసి మరీ ఇలా బాబు హామీని గుప్పించారు అని అంటున్నారు. మరి ఇది ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి.

అదే టైంలో దీనికి ధీటుగా జగన్ ఎలాంటి హామీ ఇస్తారో ఏకంగా మద్య నిషేధం అంటారో అన్న చర్చ కూడా ఉంది. ఇలా మత్తెక్కించే హామీల మధ్య రానున్న రోజుల్లో పోటీ ఏర్పడేటట్లు ఉంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News