ఎన్నిక‌ల సంఘానికి ప‌క్ష‌పాతాన్ని ఆపాదిస్తున్నారే!

Update: 2017-08-20 05:10 GMT
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లు ఇప్పుడు చాలా అంశాల‌నే శేష ప్ర‌శ్న‌లుగా మిగిల్చే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రో మూడు రోజుల్లో జ‌ర‌గ‌నున్న ఆ ఉప ఎన్నిక‌కు సంబంధించి ఇప్పుడు నంద్యాల‌లో హోరాహోరీ ప్ర‌చారం సాగుతోంది. ఓ వైపు విప‌క్ష నేత హోదాలో వైసీపీ అధినేత‌... అధికార పార్టీ టీడీపీకి చుక్క‌లు చూపిస్తున్నారు. సొంత పార్టీ నేత‌లు వ‌రుస‌గా చేస్తున్న త‌ప్పుల‌ను స‌ర్దుబాటు చేసుకోలేక టీడీపీ అధిష్ఠానం ఏం చేయాలో పాలుపోక తీవ్ర ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్క‌కొంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

మొన్న‌టికి మొన్న నంద్యాల‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భా వేదిక మీద‌... పాల‌న‌ను గాలికొదిలేసిన చంద్ర‌బాబును రోడ్డుపై నిల‌బెట్టి కాల్చేసినా త‌ప్పులేద‌న్న జ‌గ‌న్ వ్యాఖ్య‌లపై టీడీపీ నేత‌లు పెద్ద రాద్ధాంత‌మే చేశారు. అయితే టీడీపీ నుంచి ఫిర్యాదు అందేకంటే ముందే... స్పందించిన రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి భ‌న్వ‌ర్‌ లాల్ వైసీపీ అధినేత‌కు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల‌ను గౌర‌వించిన జ‌గ‌న్ కూడా నిర్దేశిత స‌మ‌యంలోగానే త‌న స‌మాధానాన్ని కూడా ఇచ్చారు. నాడు ఈ వ్యాఖ్య‌ల‌ను సుమోటోగా ప‌రిగ‌ణించి నోటీసులు జారీ చేసిన భ‌న్వ‌ర్‌ లాల్‌ ను టీడీపీ నేత‌లు ఆకాశానికెత్తేసిన వైనం మ‌నంద‌రికీ తెలిసిందే. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌ కు నోటీసులు రావ‌డంతో వైసీపీ ప‌ని ఇక అయిపోయిన‌ట్లేన‌ని కూడా టీడీపీ ప్ర‌చారం చేసింద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

నాడు త‌న‌కు గొప్ప‌గా క‌నిపించిన భ‌న్వ‌ర్‌ లాల్ ఇప్పుడు ప‌క్ష‌పాతిగా మారిపోయిన‌ట్లుగా టీడీపీ నేత‌లు నానా యాగీ చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. నంద్యాల డీఎస్పీ హోదాలో ఉన్న గోపాల‌కృష్ణపై మొన్న రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీవ్ర‌మైన చ‌ర్య తీసుకుంది. అధికార ప‌క్షానికి వ‌త్తాసు ప‌లుకుతున్న గోపాల‌కృష్ణ‌ను త‌క్ష‌ణ‌మే ఆ ప‌ద‌వి నుంచి రిలీవ్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌తో బాబు స‌ర్కారు గోపాల‌కృష్ణ‌ను త‌క్ష‌ణ‌మే బ‌దిలీ చేసి ఆ బాధ్య‌త‌ల‌ను ఓఎస్డీగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌విప్ర‌కాశ్ కు అప్ప‌జెప్పింది. అదే స‌మ‌యంలో న‌డిరోడ్డుపై డ‌బ్బులు పంచిన హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌కు కూడా నోటీసులు జారీకి రంగం సిద్ధ‌మైపోయింది. ఈ క్ర‌మంలో టీడీపీ కొత్త పాట‌ను అందుకుంది.

దేశంలో ఏ ఎన్నిక‌ల‌ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అటు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి గానీ, దాని ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తున్న రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి ఎలాంటి ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌లేదు. అయితే ఇప్పుడు వ‌రుస‌గా త‌మ‌కు నోటీసులు వ‌స్తున్న నేప‌థ్యంలో టీడీపీకి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి భ‌న్వ‌ర్ లాల్ ప‌క్ష‌పాతిగా క‌నిపిస్తున్నార‌ట‌. ఇదే విష‌యంపై టీడీపీ నేత‌లు ఆగ్ర‌హోద‌గ్రులు అవుతున్నార‌ని కూడా విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప‌లు వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి భ‌న్వ‌ర్‌ లాల్‌ పై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదే జ‌రిగితే.. ఎన్నిక‌లను నిష్ప‌క్ష‌పాత వైఖ‌రితో నిర్వ‌హించేందుకు శాయ‌శక్తులా య‌త్నిస్తున్న ఎన్నిక‌ల సంఘంపై ఫిర్యాదు చేసిన ఘ‌న‌త టీడీపీకే ద‌క్కుతుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.


Tags:    

Similar News