2019 ఎన్నిక‌లు!... టీడీపీకి వెరీ వెరీ స్పెష‌ల్‌!

Update: 2019-03-20 09:06 GMT
తెలుగు దేశం పార్టీ... మ‌న‌మంతా టీడీపీగా పిలుచుకునే పార్టీ. 1982లో తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు చేతుల్లో పురుడు  పోసుకున్న నాటి నుంచి ఇప్ప‌టిదాకా సింగిల్ గా బ‌రిలోకి దిగిన చ‌రిత్రే లేని పార్టీ. మూడున్నర ద‌శాబ్దాల చ‌రిత్ర‌లో ఎప్పుడు పోటీ చేసినా... ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునో - లేదంటే ప‌లు పార్టీల‌తో కూట‌మిగా జ‌ట్టు క‌ట్టో బ‌రిలోకి దిగిందే త‌ప్ప‌... ఏనాడూ ఒంట‌రిగా బ‌రిలోకి దిగిన చ‌రిత్రే లేని పార్టీగా టీడీపీ ఓ అరుదైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది. సింగిల్ గా బ‌రిలోకి దిగితే గెల‌వ‌లేమ‌నో, లేదంటే... ప్ర‌త్య‌ర్థి కూటమిని చూసి భ‌య‌ప‌డిందో తెలియ‌దు గానీ... ఎప్పుడు పోటీ చేసినా... టీడీపీ ఇత‌ర పార్టీల‌తో జ‌ట్టు క‌ట్టే బ‌రిలోకి దిగింది. నాడు ఎన్టీఆర్ తో పాటు ప్ర‌స్తుతం పార్టీని అప్ర‌తిహాతంగా నడిపిస్తున్న ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా ఏనాడూ పార్టీని సింగిల్ గా బ‌రిలోకి దించి ఎరుగ‌రు. ఈ కార‌ణంగానూ టీడీపీ ప్ర‌త్య‌ర్థుల‌కు ఓ అస్త్రాన్ని ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే త‌న పేరిట ఉన్న ఈ ప్ర‌త్యేక‌త‌ను బ‌ద్ద‌లు కొడుతూ ఇప్పుడు టీడీపీ ఒంట‌రి పోరుకు సిద్ధ‌మైపోయింది. వ‌చ్చే నెల 11న జ‌రిగే పోలింగ్ లో ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ ఒంట‌రిగా బరిలోకి దిగ‌బోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లెట్టిన ఆ పార్టీ ఈ విష‌యాన్ని ఎక్క‌డ కూడా ప్ర‌స్తావించ‌కుండానే సైలెంట్ గానే త‌న ఒంట‌రి పోరును ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇత‌ర పార్టీల‌తోనే బ‌రిలోకి దిగి సంచ‌ల‌న విజ‌యాల‌తో పాటు వ‌రుస ప‌రాజ‌యాలు కూడా చ‌విచూసిన టీడీపీకి... ఇప్పుడు కొత్త‌గా ఒంట‌రి పోటీ ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందోన‌న్న ఆస‌క్తి కూడా నెల‌కొంద‌నే చెప్పాలి.

ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఎదుర్కొన్న అన్ని ఎన్నిక‌ల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే... పార్టీ పుట్టిన తొమ్మిది నెల‌ల్లోనే జ‌రిగిన 1983 ఎన్నిక‌ల్లో మేనక పార్టీతో క‌లిసి పోటీ చేసింది. మేన‌కా గాంధీ ఆధ్వ‌ర్యంలోని సంజయ్‌ విచార్‌ మంచ్ తో జట్టు క‌ట్టిన ఎన్టీఆర్‌.. నాటి ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఎన్టీఆర్‌ 5 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ... బీజేపీతో పొత్తు క‌ట్టింది. ఈ ఎన్నిక‌ల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మినహా దేశమంతా ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి. ఏపీలో మాత్రం టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీకి దేశం మొత్తం మీద రెండు సీట్లు లభిస్తే అందులో ఒకటి టీడీపీ కూటమి భాగస్వామిగా హన్మకొండ నుంచి దక్కడం గమనార్హం. లోక్‌సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. 1989 ఎన్నికల్లో కూడా అదే కూటమి కొనసాగింది. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రాజీవ్‌ గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవడంతో ఇక్కడా ఆ పొత్తు కొనసాగింది. కానీ, రాష్ట్రంలో కూటమి ఓడిపోయి కాంగ్రెస్‌ గెలిచింది.

1995లో టీడీపీ రెండుగా చీలిపోయి ఎన్టీఆర్‌ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 1996 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్‌ - బీజేపీలకు ప్రత్యామ్నాయంగా యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆవిర్భావానికి చంద్రబాబు కృషి చేశారు. 1998లో లోక్‌ సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. టీడీపీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. అదే సమయంలో కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 1999లో టీడీపీ - బీజేపీ కలిసి పోటీచేశాయి. ఆ కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యారు. 2004లో మరోసారి లోక్‌ సభ - అసెంబ్లీ ఎన్నికలు కలిసి వచ్చాయి. అప్పుడూ టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత బీజేపీకి టీడీపీ గుడ్ బై చెప్పింది. 2009లో అన్ని పక్షాలతో కూటమి నిర్మాణానికి టీడీపీ ప్రయత్నించింది. టీడీపీ - టీఆర్‌ ఎస్‌ - వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. కానీ నెగ్గలేకపోయాయి.

ఇక తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీతో జ‌ట్టు కట్టిన టీడీపీ.. 2014 ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి మిశ్ర‌మ ఫ‌లిత‌మే ద‌క్కింది. తెలంగాణ‌లో ఈ కూటిమి బొక్క‌బోర్లా ప‌డ‌గా... ఏపీలో మాత్రం అధికారం ద‌క్కించుకుంది. ఇక ఇటీవ‌లే తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ సిద్ధాంతాల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టేసిన చంద్ర‌బాబు.. ఏకంగా కాంగ్రెస్ తో జ‌ట్టుక‌ట్టారు. అయితే కాంగ్రెస్ తో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన టీడీపీని ప్ర‌జ‌లు ఏమాత్రం క్ష‌మించ‌లేక‌పోయారు. గ‌తంలో ఎప్పుడూ లేనంత హీనంగా టీడీపీ రెండంటే రెండు అసెంబ్లీ సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాక త‌ప్ప‌లేదు. ఈ దెబ్బ‌తో ఏపీలో జ‌ర‌గ‌నున్న ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు మాత్రం ఒంట‌రిగానే బ‌రిలోకి దిగేందుకు టీడీపీ నిర్ణ‌యించుకోక త‌ప్ప‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌న‌తో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగానే ఉన్నా... ఎక్క‌డ తెలంగాణ రిజ‌ల్ట్స్ రిపీట్ అవుతాయేమోన‌న్న భ‌యంతో ఒంట‌రి పోరుకే బాబు జై కొట్టారు. మ‌రి ఈ త‌ర‌హాలో చ‌రిత్ర‌లో ఏనాడూ లేని రీతిలో ఒంట‌రి పోరుకు సిద్ధ‌మైన చంద్ర‌బాబుకు ఏ త‌ర‌హా ఫ‌లితం ల‌భిస్తుందో చూడాలి.

టీడీపీ పొత్తు ఎవరితో ఎప్పుడు?

1983    సంజయ్‌ విచార్‌ మంచ్‌
1985    బీజేపీ - వామపక్షాలు
1989    బీజేపీ - వామపక్షాలు
1994    వామపక్షాలు
1999    బీజేపీ
2004    బీజేపీ
2009    లెఫ్ట్‌ - టీఆర్‌ ఎస్‌
2014    బీజేపీ
2018    కాంగ్రెస్‌ - సీపీఐ (తెలంగాణ)
2019    ఒంటరిగా (రెండు రాష్ట్రాల్లో)
Tags:    

Similar News