వైసీపీ ఓట్ల తొలగింపునకు కుట్ర.?

Update: 2019-01-25 09:54 GMT
ఎన్నికల దగ్గరపడే కొద్దీ వ్యూహాలు, ప్రతివ్యూహాలు పదును తేలుతున్నాయి. ఎలాగైనా సరే ప్రత్యర్థిపై విజయం సాధించాలనుకుంటున్ననేతలు ఎంతకైనా సిద్ధం అవుతున్నారు. అలాంటి సంఘటనే విజయనగరం జిల్లాలో జరిగింది. కొంతమంది వ్యక్తులు సర్వే పేరుతో జిల్లాలో తిరుగుతున్నారు. వాళ్లు.. ఊరూరూ తిరిగి.. ఏ పార్టీకి ఓటేస్తే బావుంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని సర్వే చేస్తారు. ఈ సర్వేలోనే ఆటోమేటిగ్గా వైసీపీ ఓట్లు కూడా తెలిసిపోతాయి. అవన్నీ వారి దగ్గరున్న ట్యాబ్‌ లలో నిక్షిప్తం చేస్తారు. ఈ ట్యాబ్‌ లలో ఉన్న సమాచారం మొత్తం టీడీపీ వారికి వెళ్తుందని.. లోకేష్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీమ్‌.. వైసీపీ ఓట్లను తొలగిస్తుందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.

బెంగళూరుకు చెందిన సెంటర్‌ ఫర్‌ సోషియో పొలిటికల్‌ ఎనాల్సిస్‌ ఈ ఏపీలోని కొన్ని జిల్లాలో సర్వే చేస్తోంది. సర్వే చేసిన వారికి రోజుకి రూ.1000లతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. ఒక్కో టీమ్‌ లో 10 మంది సభ్యులు ఉంటారు. వారికి ఒక టీడీపీ నాయకుడు ఇంచార్జ్‌ గా ఉన్నాడని వైసీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. విజయనగరం జిల్లాలో ఇలా సర్వే చేస్తున్న వారిపై అనుమానం వచ్చిన వైసీపీ నాయకులు.. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదంతా చంద్రబాబు నేతృత్వంలోనే జరుగుతుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఇందులో తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ చెప్తోంది. ప్రస్తుతం సర్వే చేసిన సభ్యుల్ని విచారణ చేస్తున్నారు పోలీసులు.


Tags:    

Similar News