బాబు స‌ర్కారు క‌న్ను ఆ గ్రామం మీద ప‌డిందా?

Update: 2017-04-13 09:42 GMT
రాష్ట్ర రాజ‌ధాని నిర్మాణం కోసం భూములు అవ‌స‌ర‌మే.కానీ.. వేల‌కొద్దీ ఎక‌రాల అవ‌స‌రం ఏమిటో బాబు అండ్ కోకు త‌ప్పించి మ‌రెవ‌రికీ అర్థం కాదు. ఒక రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణానికి వేలాది ఎక‌రాలు సేక‌రించ‌టంపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ‌.. వాటిని పెడ చెవిన పెట్టి తాను చేయాల‌నుకున్న ప‌నిని మొండిగా చేసుకుంటూ పోతూ.. తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.

రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం భూములు ఇచ్చిన వారుస్వ‌చ్ఛందంగా కొంద‌రు ఇచ్చినా.. వ్య‌తిరేకించిన వారి భూముల్ని ఏదో ర‌కంగా తీసుకునేందుకు చాలానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రైతులు ఇష్ట‌ప‌డితేనే భూములు తీసుకుంటున్న‌ట్లు తొలుత బాబు చెప్పిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత మాత్రం అందుకు భిన్నంగా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. రైతుల‌ను న‌యాన‌.. భ‌యానా బెదిరించి భూముల్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉంటే.. అమ‌రావ‌తిలోని భూముల‌తో పోలిస్తే విజ‌య‌వాడ‌కు అత్యంత స‌మీపంలో ఉన్న త‌మ భూములు మ‌రింత విలువైన‌వ‌ని.. వాటిని తాము ఇవ్వ‌లేమంటూ తాడేప‌ల్లి మండ‌లం పెనుమాక రైతులు తేల్చి చెప్పారు. దీనిపై న్యాయ‌పోరాటం చేస్తున్నారు కూడా. ఈ ఉదంతంపై ప్ర‌భుత్వం కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌టానికి మూడు వారాల స‌మ‌యం కోరిన బాబు స‌ర్కారు.. తాజాగా మాత్రం ఈ గ్రామంలోని భూముల‌ భూసేక‌ర‌ణ కోసం నోటీసులు జారీ చేయ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొత్తం 660.83 ఎక‌రాల సేక‌ర‌ణ కోసం 904 మంది య‌జ‌మానుల పేర్ల మీద నోటిఫికేష‌న్ జారీ అయ్యింది.

ఓప‌క్క ప్ర‌భుత్వ తీరుపై కోర్టును ఆశ్ర‌యించిన వేళ‌.. ప్ర‌భుత్వం జారీ చేసిన నోటీసుల‌పై ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం కోర్టు ధిక్కార‌ణ కింద‌కు వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News