ఏపీ రాజ‌ధాని కేంద్రంలో టీడీపీ గ్రూప్ పాలిటిక్స్‌

Update: 2015-09-05 10:57 GMT
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిన్న‌టి వ‌ర‌కు భూసేక‌ర‌ణ వివాదాల‌కు కేంద్ర బిందువైతే తాజాగా ఇప్పుడు అక్క‌డ అధికార టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ రాజ్య‌మేలుతున్నాయి. ఏపీలో భూస్థాపితం అయ్యి ముస‌లి పార్టీగా మారిన కాంగ్రెస్ నుంచి ప‌లువురు టీడీపీలోకి జంప్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌ధానిలో అంత‌ర్భాగమైన తుళ్లూరు - తాడికొండ మండ‌లాలు ఉన్న తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. ఇక్క‌డ కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌రావు ఇటీవ‌లే టీడీపీలో చేరారు. ఆయ‌న రాక‌ను స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావాణ్‌ కుమార్‌ - మంత్రి రావెల కిషోర్‌బాబు - మాజీ మంత్రి జెఆర్‌.పుష్ప‌రాజ్ త‌దిత‌రులు తీవ్రంగా వ్య‌తిరేకించారు.

అయితే న‌ర‌సారావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు డొక్కా అనుంగు శిష్యుడు కావ‌డంతో ఆయ‌న చంద్ర‌బాబుపై ఒత్తిడి చేసి డొక్కాకు సులువుగానే టీడీపీ తీర్థం ఇప్పించేశారు. డొక్కా టీడీపీ రాక‌ను నియోజ‌క‌వ‌ర్గంలో కూడా కొంద‌రు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్పుడు టీడీపీ నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేశార‌ని..ఇప్పుడు ఆయ‌న త‌మ పార్టీలోకి వ‌స్తే తాము ఎలా ఆహ్వానిస్తామంటూ వారు మండిప‌డుతున్నారు.

వాస్తవానికి ల్యాండ్‌పూలింగ్‌ విషయంలో శ్రావణ్‌కుమార్‌కు మంచి మార్కులే పడ్డాయి. చంద్ర‌బాబు కూడా ఆయ‌న్ను ప్ర‌త్యేకంగా మెచ్చుకున్నారు. డొక్కా టీడీపీలోకి వ‌స్తే నియోజ‌క‌వ‌ర్గంలో త‌న హ‌వాకు ఎక్క‌డ గండిప‌డుతుందోన‌ని ఆయ‌న తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. అలాగే తాడికొండ‌ ఎంపీ రాయ‌పాటి సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో అక్క‌డ శ్రావ‌ణ్‌ కుమార్‌ కు మ‌రో వ్య‌తిరేక‌వ‌ర్గం కూడా త‌యారైంది. దీంతో శ్రావ‌ణ్ వ్య‌తిరేక వ‌ర్గం డొక్కాకు మ‌ద్ద‌తు ఇస్తోంది. ఇలా ఈ రెండు గ్రూపులు రోడ్డెక్కి పార్టీ ప‌రువును బ‌జారుకీడుస్తున్నాయి.

 అయితే చివ‌ర‌కు రాయ‌పాటి ఒత్తిడి మేర‌కు డొక్కాను టీడీపీలో చేర్చుకోవాల‌ని చంద్ర‌బాబు డిసైడ‌య్యారు. ఇప్పుడు శ్రావ‌ణ్‌ కుమార్‌ కు ఎంపీ రాయ‌పాటికి అస్స‌లు ప‌డ‌డం లేదు. శ్రావణ్‌ కుమార్‌ వర్గీయులు డొక్కా, రాయ‌పాటి విషయంలో గుర్రుగా ఉన్నట్టు  తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఈ ఇద్దరు నేతల ఆధిపత్య పోరు ఎంతదూరం వెళ్తుందో చూడాలి.
Tags:    

Similar News