కేసులో ఊబిలో అఖిలప్రియ..? ప్రస్తుతానికి ఒక ఊరట..?

Update: 2022-02-23 17:30 GMT
భూమా అఖిలప్రియ.. తండ్రి ఉన్నంత కాలం వీరి రాజ్యాధికారం.. కర్నూలు జిల్లాలో ఆధిపత్యం కొనసాగింది. తండ్రి తర్వాత కూడా ఆ బలమైన కుటుంబానికి రాజకీయ అండ లభించి భూమా అఖిలప్రియ మంత్రి అయ్యారు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మరీ మంత్రి పదవి కొట్టేశారు అఖిల ప్రియ. అయితే టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రావడంతో కథ మారింది. కష్టాలు దాపురించాయి. వరుస కేసులు ఇప్పుడు అఖిలప్రియను వెంటాడుతున్నాయి.

అప్పట్లో హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ బంధువులంటూ ప్రచారం సాగిన కొందరిని కిడ్నాప్ చేయడం.. అందులో అఖిలప్రియపై ఆరోపణలు రావడం.. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగిపోయాయి. ఓ భూవివాదమే ఇందుకు కారణం. ఇక్కడితోనే వీరిపై కేసులు ఆగిపోలేదు. తాజాగా కర్నూలుకు కూడా ఈ కేసులు విస్తరించాయి.

భూమా అఖిలప్రియపై ఇప్పుడు కర్నూలు జిల్లాలో కేసులు వెల్లువెత్తుతున్నాయి. అనేక కిడ్నాప్, దాడుల కేసులు నమోదయ్యాయి. అఖిలప్రియతోపాటు ఆమె భర్తపై ఈ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రధానంగా భూవివాదాలు, సెటిల్ మెంట్లు,రియల్ ఎస్టేట్, ఆస్తి వివాదాల్లో వీరిపై కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా అఖిలప్రియతోపాటు ఆమె సోదరుడి విఖ్యాత రెడ్డిపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో హైకోర్టులో ఊరట లభించింది. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ అఖిలప్రియ దాఖలు చేసిన పిటీషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

 ఎటువంటి కారణాలు లేకుండా రాజకీయ వేధింపులతోనే కేసు నమోదు చేశారని న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం సీఆర్పీసీలోని సెక్షన్ 41ఏ ప్రకారం విచారణ జరపాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.

ప్రస్తుతానికి ఈ కేసులో అఖిలప్రియకు ఊరటదక్కింది. అయితే ఇప్పటికే పలు కేసుల్లో వీరి ఫ్యామిలీ ఇరుక్కుంది. ఆ కేసులు ఏం కానున్నాయని వేచిచూడాలి.
Tags:    

Similar News