టైం చూసుకుని.. టీడీపీ నేత అరెస్టు.. రీజ‌నేంటి?

Update: 2022-10-13 04:54 GMT
అర్థ‌రాత్రి అరెస్టులు.. ఈ మాట వింటే.. ఇప్పుడు ఏపీనే గుర్తుకు వ‌స్తోంద‌ట‌. ఇక్క‌డ టీడీపీ నేత‌ల‌ను సీఐడీ అధికారులు అర్ధ‌రాత్రి చూసుకుని మ‌రీ అరెస్టులు చేస్తున్నారు. తాజాగా.. టీడీపీ రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి దారపనేని నరేంద్రను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని నరేంద్ర భార్య సౌభాగ్యం తెలిపారు. రాత్రి 8.30 గంటలకు త‌న భ‌ర్త‌ను సీఐడీ అధికారులు తీసుకెళ్లారన్నారు. త‌న‌ భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారన్న సౌభాగ్యం.. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగినా పోలీసులు సమాధానం చెప్పలేదన్నారు.

కాగా, నరేంద్ర అరెస్ట్ను టీడీపీ అధినేత‌ చంద్రబాబు ఖండించారు. కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సీఐడీ పోలీసుల తీరు మారడం లేదన్నారు. ఇదే కేసులు జర్నలిస్ట్ అంకబాబు అరెస్టును కోర్టు తప్పుబట్టిందని గుర్తు చేశారు.

పార్టీ కార్యాలయంలో పని చేసేవారిని అరెస్ట్ చేసి భయపెట్టాలనేది సీఎం జగన్ వైఖరి అని అరోపించారు. ఇలాంటి కేసుల్లో 41ఎ నోటీసు ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా.. సీఐడీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రి పూట చేస్తున్న అరెస్టులు కోర్టులో నిలబడవన్నారు. వెంటనే నరేంద్రను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

నరేంద్ర కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. నరేంద్ర అరెస్టుతో ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. నరేంద్రపై పెట్టిన తప్పుడు కేసు కోర్టులో నిలబడదని.. పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

జగన్ రెడ్డి ప్రైవేటు సైన్యంగా మారిన ఏపీ సీఐడీ అర్ధరాత్రి అరాచక అరెస్టులకు మరోసారి తెగబడిందని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దారపనేని నరేంద్ర ఇంట్లో చొరబడి మరీ సీఐడీ అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నరేంద్రను ఏ కేసులో అరెస్టు చేశారో కూడా చెప్పలేని తప్పుడు అరెస్టులు ఇంకెన్నాళ్లు? అక్రమ అరెస్టులపై కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సీఐడీ తీరు మారడం లేదని నిప్పులు చెరిగారు.

ఇదిలావుంటే, విశాఖలో బయటకు వచ్చిన వైసీపీ భూదందా అంశాన్ని దారి మళ్లించేందుకు మళ్లీ అరెస్టుల పర్వానికి తెరలేపారని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఈ అరెస్టుల‌పై కోర్టు ఏమంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News