చంద్రబాబులో కొత్త ఉత్సాహం... ?

Update: 2021-08-19 07:43 GMT
ఏపీలో చంద్రబాబు రోల్ ఏంటి అంటే విపక్షం. అది ప్రజా పక్షమా కాదా అన్నది పక్కన పెడితే ఆయన పోరాటం అంతా జగన్ మీదనే అని అందరికీ తెలిసిందే. జగన్ ఎపుడు గద్దె దిగిపోతాడు అని టీడీపీ ఎదురుచూస్తూనే ఉంటుంది. ఇక చంద్రబాబు అయితే ఏపీకి ఆమడ దూరంలో ఉన్నా కూడా తన బుర్రకు పదును పెట్టి ఎప్పటికపుడు కొత్త ఆలోచనలు చేస్తూనే ఉంటారు. ఆయన‌కు కొండంత అండ అనుకూల మీడియా. జగన్ చేసే మంచిని రాయకపోయినా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా ఉంటే మాత్రం వాటిని తాటికాయ అంత పెద్ద అక్షరాలతో మీడియాలో రాసి బాబుకు ఆనందం కలిగిస్తాయి. ఇదిలా ఉంటే అలాంటి ఆనందకరమైన వార్త ఒకటి వారికి దొరికింది.

ఏపీలో జగన్ కి బలం బాగా తగ్గిపోయిందని ఇండియా టు డే సర్వేలో వెల్లడి అయింది. మరి ఏ కారణంగా బలం తగ్గిందో తెలియదు కానీ జగన్ పాపులారిటీ ఒక్కసారిగా ప‌డిపోయిందని ఆ సర్వే చెప్పడమేంటి ఆ వెంట‌నే టీడీపీ అనుకూల మీడియా గట్టిగానే దాన్ని ప్రచారం చేసింది. అదే ఇండియా టు డే గత ఏడాది జగన్ కి దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రులలో నాలుగవ స్థానంలో ఉంటే మాత్రం ఎక్కడా రాయలేదు. అదేమని అడగకూడదు కూడా. ఇవన్నీ పక్కన పెడితే జగన్ గ్రాఫ్ తగ్గిపోయింది అంటూ అనుకూల మీడియా ఇలా రాయడమేంటి అలా టీడీపీలో పాల పొంగులా కొత్త ఉత్సాహం చెలరేగుతోంది. వచ్చేది తమదే ప్రభుత్వం అని టీడీపీ శ్రేణులు అపుడే హుషార్ చేస్తున్నాయి.

ఇక చంద్రబాబు అయితే భవిష్యత్తు కార్యాచరణను కూడా సిధ్ధం చేసుకుంటున్నారుట. జగన్ మీద జనాలను ఎగదోసేందుకు ఇదే తగిన సమయం అని కూడా ఆయన భావిస్తున్నారుట. అదే టైంలో తనతో కలసి వచ్చే వారిని కూడా కలుపుకుని జగన్ని ఒంటరి చేయాలని కూడా బాబు గట్టిగా డిసైడ్ అయ్యారు. ప్రస్తుతానికి కరోనా మూడవ దశ అని అంటున్నారు. మూడో దశ ముగిశాక అంటే నవంబర్ నుంచి ఏపీ వ్యాప్తంగా బాబు టూర్లు చేయడానికి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశార‌ట.

మొత్తానికి జగన్ కి ప్రజాదరణ తగ్గింది అన్న ఇండియా టు డే ఒకే ఒక్క సర్వే టీడీపీని నేల మీద ఉండనీయడంలేదుట. ఇక టీడీపీ వాళ్లు సోష‌ల్ మీడియాలో చేస్తోన్న హంగామా మామూలుగా లేదు. మరి ఇదే నిజమనుకుని ఇప్పటి నుంచే ఊహాలోకంలో తిరిగితే అసలుకే ఎసరు వస్తుందేమో అని కూడా మరో వైపు సెటైర్లు పడుతున్నాయి.




Tags:    

Similar News