లొంగిపోలేదు.. ఇంట్లోనే చింతమనేని అరెస్ట్

Update: 2019-09-11 10:02 GMT
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. పరుష వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో దర్శనమిచ్చే దెందులూరు మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. కులం పేరుతో దూషించిన కేసుతో పాటు.. పలు కేసులు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేయటానికి గడిచిన కొద్ది రోజులగా పోలీసులు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించటం.. రేపో.. మాపో బెయిల్ వస్తుందన్న మాట వినిపిస్తున్న వేళ.. మంత్రి బొత్స సత్తిబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

నిజంగానే చింతమనేని తప్పు చేయకుంటే ఎందుకు అండర్ గ్రౌండ్ కు వెళతారని ప్రశ్నించారు దీంతో.. తాను పోలీసుల ఎదుట లొంగిపోతానని కొన్ని మీడియా సంస్థలకు ఫోన్ చేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలా లొంగిపోతారన్న ఉత్కంట వ్యక్తమైంది. ఇదిలా ఉంటే.. చింతమనేనిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ఏకంగా పన్నెండు పోలీసు టీంలు వెతుకుతున్నాయి. అయినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన్ను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు.

తన భార్య ఆరోగ్యం సరిగా లేకపోవటంతో.. ఆమెను చూసేందుకు అండర్ గ్రౌండ్ లో ఉన్న చింతమనేని ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం ఆయనఇంట్లోకి ప్రవేశించి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తారని పోలీసుల్ని ప్రశ్నించినా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదంటున్నారు. చింతమనేనిని అరెస్ట్ చేసి ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో.. ఆయన అభిమానులు అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా ఉద్రిక్త చోటు చేసుకుంది.

ఇదిలా ఉంటే.. చింతమనేనిని అరెస్ట్ చేసే సమయంలో ఆయన సతీమణి విషయంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుతో ఆమె మరింత అనారోగ్యానికి గురై.. కింద పడిపోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో వైద్యసేవల్ని అందిస్తున్నారు. అయితే.. ఇదంతా ఉత్త నాటకంగా అభివర్ణిస్తున్న వారు లేకపోలేదు. మొత్తంగా చింతమనేని అరెస్ట్ తో ఆయన కోసం సాగుతున్న రెండు వారాల వేటకు పుల్ స్టాప్ పడినట్లైంది.  



Tags:    

Similar News