చంద్రబాబు తీరుపై తమ్ముళ్లలో అసంతృప్తి!

Update: 2017-10-07 04:21 GMT
పవన్ కల్యాణ్ తో బంధం, తెదేపా నాయకుల మీద ఆయన సెటైర్లు - ఆయన మీద తెదేపా నాయకుల సెటైర్ల వ్యవహారం.. పాలక పార్టీలో అసంతృప్తులను రేపుతోంది. చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న శైలి పార్టీ నాయకుల ఆత్మాభామానాన్ని దెబ్బతీసేలా ఉన్నదంటూ పలువురు భావిస్తున్నారు. సొంత పార్టీ కేడర్ ను కాపాడిన తర్వాతే.. అధినేత ఇతర బంధాలమీద దృష్టిసారిస్తే.. అది పార్టీకి కూడా గౌరవం ఉంటుందని, అయితే చంద్రబాబు మాత్రం పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా.. వ్యవహరిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పవన్ కల్యాణ్ తెదేపాకు చెందిన వారి మీద జనసేన బహిరంగ సభలు ప్రారంభించిన నాటినుంచి దెప్పిపొడుపు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. రకరకాల సెటైర్లు వేస్తున్నారు. తొలి సభలోనే ఎంపీల వైఫల్యాల మీద నిప్పులు చెరిగిన పవన్.. కేంద్రమంత్రి అశోకగజపతిరాజు మీద కూడా ఫోకస్ పెట్టారు. దీనికి ప్రతిగా అప్పట్లో ఆయన పవన్ కల్యాణ్ నాకు తెలియదు అంటూ కామెంట్ చేసిన సంగతి అందరికీ తెలుసు. తాజాగా పితాని  కూడా ఆ తరహా కామెంట్లు చేశారు.

అయితే ఇలాంటి వ్యవహారాల్లో తెలుగుదేశం అధినేత... తాను జోక్యం చేసుకోకుండా.. ఏదో స్వల్ప విషయాలుగా పరిగణించి వదిలేస్తే పోయేదని.. అలా కాకుండా.. తాను ఏదో ప్రత్యేకంగా ఆరాలు తీసి.. పవన్ తో సంయమనం పాటించాలని దూకుడు కామెంట్లు చేయరాదని తమ పార్టీ నేతలను తప్పుపట్టడం తగని పని అని, సొంత పార్టీలోనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకవైపు పవన్ కల్యాణ్ తెలుగుదేశం తో ఇంకా మిత్రపక్షంలాగానే కొనసాగుతున్నాడో లేదో వారికే తెలియని సంగతి. ఎందుకంటే.. ఇటీవలి కాలంలో.. ఆయన పార్టీ ఆ రీతిగా వ్యవహరించిన దాఖలాలు ఏమీ లేవు. ఉద్ధానం కిడ్నీ సమస్యల విషయంలో చంద్రబాబును కలవడం మినహా.. ఆయన మరొక అంశాన్ని పట్టించుకున్నది కూడా లేదు. చంద్రబాబుతో భేటీ అయింది కూడా లేదు. అలాంటప్పుడు.. ఆయనను ఇంకా తమ కూటమి లో పార్టీనేతలాగా భావిస్తూ ఆయనను నొప్పించకుండా మాట్లాడాలని సొంత వారికి క్లాస్ తీసుకోవడం చంద్రబాబుకు ధర్మమేనా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబునాయుడు ఎంతసేపూ కులసమీకరణాలు... పవన్ కల్యాణ్ ద్వారా మైత్రి అనే ప్రచారం తన పార్టీకి కలిగే లబ్ధి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని.. పవన్ కల్యాణ్ వలన తన పార్టీ నాయకుల గౌరవానికి కలుగుతున్న భంగపాటు గురించి ఆలోచించడం లేదని వారు మధనపడుతున్నారు.
Tags:    

Similar News