అమిత్‌ షాపై దాడా- బాబు రాజ్యం, గూండా రాజ్యం

Update: 2018-05-11 10:50 GMT
క‌ర్ణాట‌క ప్ర‌చారం ముగించుకుని తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌రుడి ద‌ర్శనానికి వ‌చ్చిన అమితా షాకు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న కాన్వాయ్‌ పై  తిరుమలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ అనూహ్య ఘ‌ట‌న‌కు అమిత్ షా బృందంతో పాటు - భ‌క్తులు కూడా ఖంగు తిన్నారు. అమిత్ షా తిరిగి వెళ్తున్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగింది. ఈ దాడిలో షా కాన్వాయ్‌లోని ఓ వాహనం అద్దం పగిలింది.

అయితే, అలిపిరి వ‌ద్ద కూడా కొంద‌రు ఆందోళ‌న కారులు అమిత్ షా కాన్వాయ్‌లో వెళ్తుండ‌గా అమిత్ షా గోబాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయ‌నకు ప్రొటోకాల్ ప్ర‌కారం పూర్తి స్థాయిలో భ‌ద్ర‌త క‌ల్పించిన పోలీసు అధికారులు ద‌ర్శ‌నం చేయించి ప్ర‌సాదం - జ్ఞాపిక ఇచ్చి స‌త్క‌రించి పంపారు.

అయితే, ఈ దాడిపై చంద్ర‌బాబు స్పందిస్తూ దాడిని ఖండించారు. దాడులు చేయడం తమ పద్ధతి కాదని పేర్కొన్నారు. టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ అని, దానిని త‌ప్ప‌వ‌ద్ద‌ని టీడీపీ నేతలు - శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని హెచ్చరిస్తూ దాడిని ఖండించారు.

బాబు ప‌ద్ధ‌తే అది ...

టీడీపీ తీరుపై బీజేపీ నేత‌లు తీవ్రంగా మండిప‌డ్డారు. ఇది ప‌క్కా ప్లాన్ వేసుకుని చేసిన దాడే అని వారు ఆరోపించారు. దాడులు సీఎం చంద్ర‌ బాబు ప్లానే అని బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దాడులను టీడీపీ ముందుగా అనుకుని చేసింద‌ని, దీనికి బాబు ప్రోత్సాహం ఉంద‌న్నారు. ఇలాంటి దాడులతో స‌మాజానికి బాబు ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నార‌ని ఆయ ప్ర‌శ్నించారు. ఒక జాతీయ పార్టీ అధ్య‌క్షుడిపై ఇలాంటి దాడి జ‌రిపిన పార్టీగా తెలుగుదేశం హీన‌మైన చ‌రిత్ర‌ను మూట‌గ‌ట్టుకుంద‌న్నారు. అస‌లు బాబు పార్టీ హోదా పోరాట‌మే డ్రామా అని.. లేక‌పోతే హోదా సంజీవ‌ని కాద‌ని ఆ రోజు ఎలా అన‌గ‌లిగార‌ని సోము నిల‌దీశారు. ఇది బీజేపీపై అక్క‌సుతో, మా పార్టీని అధికార బ‌లంతో అణ‌చాలని బాబు చేసిన ప్ర‌య‌త్నంగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

దీనిపై ఆ పార్టీ నేత విష్ణుకుమార్‌ రాజు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. మీకు నచ్చిన‌ట్లు లేక‌పోతే మ‌నుషుల‌పై దాడి చేస్తారా అంటూ విష్ణు మండిప‌డ్డారు. అస‌లు ఇది తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు చేసిన దాడా?  ముఖ్య‌మంత్రి ఆదేశాలతో చేసిన దాడా అన్న‌ది తేలాల్సి ఉందన్నారు. ఒక జాతీయ పార్టీ అధ్య‌క్షుడు అయిన‌ అమిత్‌షాకు భద్రత కల్పిచడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. అమిత్ షాకు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక‌పోయిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. టీడీపీ గూండా రాజ్య‌మ‌ని, కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించారన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచే ప్ర‌స‌క్తే లేద‌ని విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News