మ‌హానాడు సాక్షిగా త‌న్నుకున్న త‌మ్ముళ్లు

Update: 2016-05-20 05:46 GMT
క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో విబేధాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. ఏకంగా పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు సొంత జిల్లా, అదికూడా తెలుగుదేశం పండుగ అయిన మ‌హానాడు ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్న నాయ‌కులు అదే వేదిక సాక్షిగా క‌ర్ర‌ల‌తో కొట్టుకోవ‌డం సంచల‌నం సృష్టిస్తోంది.

తిరుప‌తిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయ‌గా ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి - తదితరులు పాల్గొని మహానాడు ఏర్పాట్లపై చర్చించారు. సమావేశానికి పూర్తిస్థాయిలో ద్వితీయశ్రేణి నాయకులు కొందరు హాజరుకాలేదు. దీనిని కొందరు పార్టీ కార్యకర్తలే వీడియో తీసి వాట్సాప్‌ - ఫేస్‌ బుక్‌ లలో పెట్టి.. మహానాడుపై స్థానిక నాయకులు నిర్లక్ష్యం చూపిస్తున్నారంటూ వాఖ్యలు చేశారు. ఇది పెద్ద దుమారం రేపింది. ఆ మ‌రుస‌టి రోజు మహానాడు వేదిక వద్ద పనులు జరుగుతుండగా తెదేపా నాయుకుడు కోడూరు బాలసుబ్రహ్మణ్యం అనుచరులు అలీఖాన్‌ - మధులు అక్కడికి వచ్చారు. అక్కడే ఉన్న నగర అధ్యక్షుడు దంపూరు భాస్కర్‌ యాదవ్‌ - కృష్ణయాదవ్‌ లతో మాట్లాడారు. పార్టీలో ఉండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిని దూరంగా ఉంచాలంటూ మధు - అలీఖాన్‌ పై భాస్కర్‌ యాదవ్‌ తో పాటు మరికొందరు వ్యాఖ్యానించారు. దీనిపై అలీఖాన్‌ స్పందిస్తూ పనిచేసే వారికి పదవులు ఇవ్వడంలేదని అనడంతో.. విస్తృతస్థాయి సమావేశం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తావా అంటూ భాస్కర్‌ యాదవ్‌ వర్గం మధు - అలీఖాన్‌ లపై దాడికి యత్నించిన్నట్లు తెలిసింది. దాంతో దెబ్బలు తిన్న మధు బాలసుబ్రహ్మణ్యంకు ఫోన్‌ చేసి తనపై దాడి చేశారని చెప్పడంతో.. బాలసుబ్రహ్మణ్యం తన అనుచరులతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. భాస్కర్‌ - కృష్ణయాదవ్‌- బాలసుబ్రహ్మణ్యం - ఆయన అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు.

నిన్నమొన్నటి వరకూ సమైక్యాంధ్ర ఉద్యమంలో చంద్రబాబును తిట్టి ఇప్పుడు అజమాయిషీ చేయాలని చూస్తున్నారా అంటూ భాస్కర్‌ యాదవ్‌ వర్గీయులు బాలసుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డారు. దాంతో కాసేపు వాగ్వాదం - తోపులాటలు జరిగాయి. ఇంతలో కృష్ణయాదవ్‌ - బాలసుబ్రహ్మణ్యంలు కట్టెలు తీసుకువచ్చారు. కర్రలతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. పాత్రికేయులు అక్కడికి చేరుకున్నప్పటికీ రెండు వర్గాలు బూతులు తిట్టుకుంటూ దాడులు చేసుకుని తోసుకున్నారు. పరిస్థితి విషమించడంతో అక్కడే ఉన్న పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు వివాదాన్ని సద్దుమణిగేలా రెండు వర్గాల వారిని విడిపించారు. బాలసుబ్రహ్మణ్యం అక్కడి నుంచి నిష్క్రమించడంతో వివాదం సద్దుమణిగింది. ఇంత జరుగుతున్నా సంఘటన స్థలంలో ఉన్న పోలీసులు కనీసం జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. విషయాన్ని రెండు వర్గాలు మంత్రి బొజ్జల దృష్టికి తీసుకువెళ్లాయి. దీనిపై ఇప్పుడు చర్చ వద్దని, మహానాడు పూర్తయ్యాక మాట్లాడుదామంటూ సర్దుబాటు చేసి పంపించేశారు. దాంతో వివాదం సద్దుమణిగింది. సంఘటనపై నాయకుల తీరును అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లడానికి ముందు పార్టీ జిల్లా అధ్యక్షుడికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని రెండు వర్గాలు సిద్ధమయ్యాయి.

మహానాడు వేదిక నిర్మాణ పనులు జరుగుతుండగా, తిరుపతి స్థానిక నాయకులు బాహాబాహీకి దిగిన సంఘటనను టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఘటన అన్ని ఛానళ్లలో ప్రసారం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకున్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News