ఫిరాయింపులో మొరాయింపు

Update: 2017-04-09 08:48 GMT
ఎమ్మెల్యేల స్థాయి నుంచి మున్సిపల్ కౌన్సిలర్ల స్థాయి వరకు అందరినీ వైసీపీ నుంచి టీడీపీలోకి చక్రం తిప్పాలని ట్రై చేస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొందరికి మంత్రి పదవులు రావడంతో మిగతావారు అలిగిన విషయం మర్చిపోకముందే కడపలో ఇంకో షాక్ తగిలింది.  వైసీపీ నుంచి ఫిరాయించిన కౌన్సిలర్ల సాయంతో అక్కడ మున్సిపల్ చైర్మన్‌ పదవిని సొంతం చేసుకున్న టీడీపీకి ఇప్పుడు కొత్త చిక్కువచ్చి పడింది.
    
టీడీపీలో ఒప్పందం మేరకు మరొకరికి అవకాశం ఇచ్చేందుకు గురివిరెడ్డి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్తగా తనకు బాగా కావాల్సిన ఆనం రఘురామిరెడ్డికి చైర్మన్‌ గిరి అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వరదరాజులరెడ్డి భావించారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. వరదరాజుల రెడ్డి రాజకీయాలతో విసిగిపోయిన 13 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. ఆనం రఘురామిరెడ్డే కాకుండా వరదరాజుల రెడ్డి బలపరిచే ఏ వ్యక్తికి కూడా తాము మద్దతు ఇవ్వబోమని ఆ కౌన్సిలర్లు తేల్చిచెప్పారు. వారు ఇప్పుడు ఏకంగా క్యాంపుకు వెళ్లిపోయారు.
    
ఇదే అదనుగా ముక్తియార్ అనే నాయకుడు చక్రం తిప్పుతున్నారు. 13 మంది టీడీపీ కౌన్సిలర్లు తనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవడంతో చైర్మన్‌ పీఠం అధిరోహించేందుకు వైసీపీ సాయం కోరారు. శ్రీరామనవమి రోజు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన ముక్తియార్ తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేస్తానని హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి అధిపత్యం తిరిగి మొదలవకుండా మిగిలిన వర్గాలన్నీ ఏకమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా వరదరాజుల రెడ్డికి వ్యతిరేకంగా తన అనుచరులతో పావులు కదుపుతున్నారు. కొత్త చైర్మన్‌గా  రఘురామిరెడ్డిని ఎన్నుకోలంటూ ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్‌ లు ఆదేశించినా టీడీపీ కౌన్సిలర్లు లెక్కచేయలేదు. రాజీనామా చేసిన మాజీ చైర్మన్ గురివిరెడ్డి కూడా వరదరాజులరెడ్డికి వ్యతిరేకంగా ముక్తియార్‌ కు ఓటేసేందుకు సిద్దమవ‌డం ఇక్క‌డ పెద్ద ట్విస్ట్‌. దీంతో వరదరాజుల రెడ్డి బలపరుస్తున్న  రఘురామిరెడ్డి ఆశలు ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది.
    
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తొలిరోజుల్లోనే 8మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి ఫిరాయించారు. ఇప్పుడు టీడీపీకి చెందిన ఐదురుగు కౌన్సిలర్లు, వైసీపీ నుంచి ఫిరాయించిన 8 మంది కౌన్సిలర్లు వరదరాజుల రెడ్డికి వ్యతిరేకంగా గుంపు కట్టారు. వైసీపీలో మిగిలిన 9మంది కౌన్సిలర్లు కూడా ముక్తియార్‌ను బలపరిచేందుకు సిద్ధమవడంతో వరదరాజుల రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ బలపరిచిన రఘురామిరెడ్డికి తిప్పలు తప్పడం లేదు. వైసీపీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు కూడా బలపరిస్తే ముక్తియార్ బలం 22కు చేరుతుంది. రఘురామిరెడ్డి బలం 16వద్దే ఆగిపోతుంది.  అయితే డబ్బు, అధికారం ప్ర‌భావంతో  ఏప్రిల్ 15న జరిగే చైర్మన్ ఎన్నిక నాటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News