అమిత్ షాపై బాబు మార్క్ వార్ షురూ

Update: 2018-03-26 05:15 GMT
బీజేపీ.. టీడీపీల మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధం కాస్తా లేఖ‌ల వార్ గా మారిన సంగ‌తి తెలిసిందే. తాము కూట‌మి నుంచి  ఎందుకు వైదొలిగామ‌న్న విష‌యంతో పాటు.. ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని త‌న లేఖ‌తో చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. దీనికి బ‌దులుగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మ‌రో లేఖ‌తో స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే.  బాబు మాట‌ల‌న్ని అబ‌ద్ధాల‌ని.. ఏపీకి తామెంతో చేసిన‌ట్లుగా అమిత్ షా త‌న 8 పేజీల లేఖ‌లో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

షా లేఖాస్త్రానికి బాబు మార్క్ కౌంట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. షా లేఖ‌లోని ప్ర‌ధానాంశాలకు బ‌దులు అన్న‌ట్లుగా.. ఆరోప‌ణ‌.. వాస్త‌వం అంటూ టీడీపీ నాలెడ్జ్ సెంట‌ర్ ఒక ప‌త్రాన్ని త‌యారు చేసింది. అమిత్ షా చెప్పిన మాట‌ల‌న్నీ ఉత్త అబ‌ద్ధాలుగా తేల్చేసే ప్ర‌య‌త్నం చేయ‌టంతో పాటు.. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల్లో అస‌లు ప‌సే లేద‌న్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. తాము త‌యారు చేసిన ప‌త్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రికి చేరేలా చేయాల‌న్న ప్ర‌య‌త్నంలో త‌మ్ముళ్లు ఉన్నారు.

టీడీపీ విడుద‌ల చేసిన అధ్య‌య‌న ప‌త్రంలో షా ఆరోప‌ణ‌ల‌కు ఎలా స‌మాధానాలు ఇచ్చార‌న్న‌ది చూస్తే..

అమిత్‌ షా: కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాం.

టీడీపీ: ఇలా 29 రాష్ట్రాలకూ ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది కాదు. పేరుకే 42 శాతం కానీ వాస్తవంగా ఇస్తోంది 37 శాతం నిధులే. అదీ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే ఆదాయంలో ప్రతి రూ.100లో రూ.37 మాత్రమే తిరిగిస్తున్నారు. మన డబ్బులో కొంతే మనకు ఇస్తున్నారు.

అమిత్‌ షా: 2014-15 సంవత్సరం రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం రూ.3,970 కోట్లు విడుదల చేసింది. 2015-16 ఏడాదిలో  మరో రూ.1,600 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించింది. 2014-15 సంవత్సరం లోటులో రైతు రుణమాఫీ - పింఛన్లు వ్యయాన్ని చేర్చి రూ.16,000 కోట్లు లోటుగా చూపడం సరైంది కాదు.

టీడీపీ: 2014-15లో రెవెన్యూ లోటు రూ.16,000 కోట్లు ఉందని కాగ్‌ నిర్ధారించినా అందుకు కేంద్రం ఎందుకు అంగీకరించడం లేదు. రాష్ట్ర విభజనలో భాగం పంచుకున్న భాజపా లోటు భర్తీ చేసే బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదు?

అమిత్‌ షా: పోలవరానికి ఇప్పటి వరకూ కేంద్రం రూ.5364 కోట్లు ఇచ్చింది.

టీడీపీ: పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.12 వేల కోట్లు ఖర్చు చేసింది. ఆ లెక్కన రాష్ట్రానికి కేంద్రమే రుణపడి ఉంది. జాతీయ ప్రాజెక్టు ఖర్చు మొత్తం కేంద్రమే భరించాలి. గిరిజనులు, రైతుల పరిహారం, పునరావాసానికి అవసరమయ్యే రూ.33 వేల కోట్లకు సంబంధించి అమిత్‌షా ఎందుకు తన లేఖలో స్పష్టత ఇవ్వలేదు.

అమిత్‌ షా: వెనుకబడిన ప్రాంతాలకు, రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధులు పెద్దగా ఖర్చు పెట్టలేదు. 12 శాతం ఖర్చుకే వినియోగపత్రాలిచ్చారు.

టీడీపీ: రాయలసీమ, ఉత్తరాంధ్రల్లోని వెనుకబడిన ఏడు జిల్లాలకు కేంద్రం రూ.1050 కోట్లే ఇచ్చింది. అందులో 92 శాతం ఖర్చు చేశాం. 12 శాతమే ఖర్చు చేశామనడం అసత్యం. వినియోగపత్రాలు సమర్పిస్తేనే రెండు, మూడో విడతల నిధులు విడుదల చేశారు. నాలుగో విడతలో రూ.350 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేయగా... ప్రధాని కార్యాలయం ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది.
 
అమిత్‌ షా: రాజధాని అమరావతికి రూ.2500 కోట్లిచ్చాం. పట్టణాభివృద్ధి శాఖ రిలీజ్‌ చేసిన రూ.1000 కోట్లలో 8 శాతమే ఖర్చు చేశారు.

టీడీపీ: విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికిచ్చిన రూ.1000 కోట్లతో చేపట్టిన వాటిల్లో ఇప్పటికే 42 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా వాటిని కూడా గడువులోగా పూర్తి చేస్తాం. రాజధానికి రూ.1500 కోట్లే ఇచ్చారు. ఆ మొత్తంతో 6 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్‌ భవనాలు నిర్మించాం. 80 లక్షల చదరపు అడుగుల్లో అధికారుల - సిబ్బంది - ఎమ్మెల్యేల నివాస సముదాయాలను నిర్మిస్తున్నాం. కొండవీటి వాగు ఎత్తిపోతల నిర్మాణం వేగంగా సాగుతోంది.

అమిత్‌ షా: విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు నిధుల కోసం ఎస్‌పీవీ ఏర్పాటు చేయమంటే రాష్ట్ర స‌ర్కార్‌ పట్టించుకోలేదు.

టీడీపీ: ఈశాన్య రాష్ట్రాలకు 2027 వరకూ ప్రత్యేక హోదాను కొనసాగిస్తున్న కేంద్రం వారికి ఎస్‌పీవీ ద్వారా కాకుండా నేరుగానే నిధులిస్తోంది. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ఇవ్వరు? ఇది వివక్ష కాదా? ఎస్‌పీవీ ఏర్పాటు అంటేనే మన డిమాండును కోల్డ్‌స్టోరేజీలోకి నెట్టడమే. ప్రత్యేక హోదా హక్కు నిరాకరించడమే.

అమిత్‌ షా: విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి రూ.8991.38 కోట్ల మేరకు సంతకాలు జరిగాయి

టీడీపీ: 2016 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకూ ఒక్క రూపాయీ విడుదల కాలేదు. ఒప్పందంపై సంతకాలు చేసినా నిధుల విడుదలకు సంబంధించిన నియమాలు రూపొందించకుండా కేంద్రం నిర్లక్ష్యం చేసింది. చంద్రబాబు 29 సార్లు దిల్లీ వెళ్లినా, తెదేపా కేంద్ర మంత్రులిద్దరూ ఎంత ప్రయత్నించినా నియమాలు రూపొందించలేదు. అందుకే ఆ సంతకాలు కాగితాలకే పరిమితమయ్యాయి.

అమిత్‌ షా: 2022 నాటికి 11 జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉండగా...9 విద్యాసంస్థలు ఇప్పటికే ఏర్పాటు చేశాం.

టీడీపీ: జాతీయ విద్యాసంస్థలకు రూ.11,762 కోట్లు  అవసరమైతే నాలుగేళ్లలో రూ.576 కోట్లు ఇచ్చారు. దామాషా ప్రకారం చూసినా రూ.4 వేల కోట్లు ఇవ్వాలి. ఇలా అయితే నిర్మాణాలు పూర్తికావడానికి 30 ఏళ్లు పైగా పడుతుంది.
Tags:    

Similar News