ఈ లెక్క‌ల‌న్ని అప్పుడు చెప్ప‌లేదేం త‌మ్ముళ్లు?

Update: 2017-05-09 07:44 GMT
కామ్‌గా ఉన్నంత‌వ‌ర‌కూ ఓకే. నోరు విప్పి త‌ప్పు ప‌డితే మాత్రం త‌ట్టుకోలేం సుమి అన్న‌ట్లుగా ఉంది ఏపీ అధికార‌ప‌క్ష నేత‌ల తీరు.  జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద త‌మ‌కు త‌ట్టెడు గౌర‌వం ఉంద‌ని.. అలా అని ఆయ‌నేం మాట్లాడినా చూస్తూ మాత్రం ఊరుకోమని చెబుతున్నారు తెలుగు త‌మ్ముళ్లు. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా.. ఒక్కో అంశం మీద త‌న వాయిస్‌ ను లేఖ‌ల రూపంలోనూ.. ట్వీట్ల రూపంలోనే బ‌య‌ట‌కు వెల్ల‌డిస్తున్న ప‌వ‌న్ తీరు త‌మ్ముళ్ల‌కు ఇబ్బందిక‌రంగా మారింది.

మొన్న‌టివ‌ర‌కూ ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చిన నార్త్‌.. సౌత్ త‌మ‌కు ఎఫెక్ట్ లేక‌పోవ‌టంతో కామ్ గా ఉన్న వారు.. ఈ రోజు త‌మ అధినేత చంద్ర‌బాబు నియ‌మించి టీటీడీ ఈవో ఎంపిక‌ను త‌ప్పు ప‌ట్టేస‌రికి త‌మ్ముళ్ల‌కు ఒక్క‌సారిగా ఆగ్ర‌హం త‌న్నుకొచ్చింది. మా అధినేత నిర్ణ‌యాన్నే త‌ప్పు ప‌డ‌తావా? అంటూ వారు శివాలెత్తుతున్నారు. ద‌క్షిణాదికి చెందిన నీలం సంజీవ‌రెడ్డి రాష్ట్రప‌తి కాలేదు.. పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధాన‌మంత్రి కాలేదా? అంటూ కొత్త క్వ‌శ్చ‌న్లు వేస్తున్నారు.

మ‌రింత బ‌లంగా త‌మ వాద‌న‌లు వినిపించే తెలుగు త‌మ్ముళ్లు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేసీఆర్‌.. ఉమ్మ‌డి రాష్ట్రంలో సీమాంధ్ర‌పాల‌కులు దోచుకున్నారు? తాము దోపిడీకి గురి అయ్యామ‌ని చెప్పే వేళ‌.. నోరు తెర‌వ‌రు ఎందుక‌న్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారింది. ప‌వ‌న్ నార్త్‌.. సౌత్ మాట‌ల మీద క‌స్సు మంటున్న త‌మ్ముళ్లు.. ఏపీ పాల‌కుల మీద కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల్ని ఇదే రీతిలో ఎందుకు త‌ప్పు ప‌ట్ట‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. త‌మ మౌనంతో తెలుగు త‌మ్ముళ్లు.. కేసీఆర్ మాట‌లు నిజ‌మ‌ని తేలుస్తున్నారా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఒక‌వేళ అదే నిజ‌మైతే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ర‌చూ విభ‌జ‌న కార‌ణంగా త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ వ్య‌క్తం చేసే అక్రోశంలో అర్థం లేద‌నే చెప్పాలి.

ఇక‌.. త‌మ్ముళ్ల మాట‌లు విన్న‌ప్పుడు.. ద‌క్షిణాది ప్రాంతానికి చెందిన వారు అత్యుత్త‌మ స్థానాల్లో కూర్చోవ‌టాన్ని క‌వ‌రింగ్‌ గా చెబుతున్న వైనం కామెడీగా క‌నిపించ‌క మాన‌దు. స్వాతంత్ర్యం వ‌చ్చిన ఈ 70 ఏళ్ల కాలంలో ద‌క్షిణాది వారికి ద‌క్కిన అత్యుత్త‌మ ప‌ద‌వులు ఎన్ని? ఉత్త‌రాది వారికి ద‌క్కిన ప‌ద‌వులు ఎన్ని? ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రప‌తులుగా.. ప్ర‌ధానులుగా ఉన్న వారిలో ఉత్త‌రాది వారు ఎంత‌? ద‌క్షిణాది వారు ఎంత‌? అన్న‌ది లెక్క తీస్తే.. ద‌క్షిణాదికి జ‌రిగిన న‌ష్టం ఏంటో తెలుస్తుంది. అంతేనా? దేశంలో వ‌చ్చే ఆదాయంలో ద‌క్షిణాది వాటా ఎంత‌? ఉత్త‌రాది వాటా ఎంత‌?

ఆయా ప్రాంతాల నుంచి వ‌చ్చే ఆదాయాన్ని తిరిగి అదే ప్రాంతానికి ఎంత ఖ‌ర్చు చేస్తున్నారు? లాంటి అస‌లు లెక్క‌ల్లోకి వెళితే.. ఎంత న‌ష్టం వాటిల్లిందో ఇట్టే అర్థం కాక మాన‌దు. నార్త్‌.. సౌత్ లొల్లిలోకి త‌ల‌దూరుస్తున్న త‌మ్ముళ్లు.. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పేందుకు సైతం సిద్ధ‌మేనా? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. అందుకు ఓకే అయితే.. వారు చెప్పాల్సిన స‌మాధానాలు చాలానే ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News