వంశీతో అర్ధ‌రాత్రి టీడీపీ నేత‌ల చ‌ర్చ‌లు..ఏం జ‌రిగిందంటే...

Update: 2019-10-31 08:20 GMT
ఇటీవల టీడీపీకి. గన్నవరం శాసనసభ సభ్యత్వానికి వల్లభనేని వంశీమోహన్‌‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వంశీ కొద్ది రోజులుగా త‌న రాజీనామా వ్య‌వ‌హారంపై నాన్చుతూ ఉండ‌డంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగి వంశీని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేశారు. హైద‌రాబాద్‌ లో ఉన్న వంశీ గ‌న్న‌వ‌రం రావ‌డంతో ఆయ‌న‌తో టీడీపీ నేత‌లు చ‌ర్చ‌లు జ‌రిపారు. వంశీతో చ‌ర్చ‌లు జ‌రిపే బాధ్య‌త‌ను చంద్ర‌బాబు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితో పాటు మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌కు అప్ప‌గించారు. ఈ నేప‌థ్యంలో కేశినేని నివాసంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు నాని - నారాయ‌ణ ఇద్ద‌రూ వంశీతో ఏకంగా నాలుగు గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలిసింది.

అర్ధరాత్రి దాటే వరకు ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వంశీ తాను పార్టీలో ఉండ‌లేన‌న్న విష‌యాన్ని వారికి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. తాను ఇప్పటికే ఓ నిర్ణయం తీసేసుకున్నాను కాబట్టి ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారికి స్పష్టం చేశార‌ట‌. ఇక గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌తో పాటు త‌న అనుచ‌రుల‌పై అక్ర‌మ కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని... ఈ విష‌యంలో తాను తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు కూడా వంశీ  వారికి చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే తాను విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు - ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు సొంత పార్టీ నేత‌ల నుంచే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వీరికి చెప్పిన వంశీ మాజీ మంత్రి దేవినేని ఉమా తీరుపై తీవ్రంగా విరుచుకుప‌డిన‌ట్టు టాక్‌. ఉమా ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు ఎంపీ నాని సైతం తాను ఉమా తీరుతో ఇబ్బందులు ప‌డ్డానంటూ వంశీని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశార‌ట‌.

అయితే వంశీకి అటు ఎంపీ నాని - నారాయ‌ణ ఇద్ద‌రూ టీడీపీలో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంత‌కూ వంశీ వారి మాట విన‌క‌పోవ‌డంతో చేసేదేం లేక ఎవ‌రిదారిన వారు వెళ్లిపోయార‌ట‌. ఇక వంశీతో చర్చల వివరాలను కొనకళ్ల - కేశినేని నానిలు చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం. ఇక టీడీపీని వీడ‌డం వంశీ ఖాయ‌మే అయినా మ‌ళ్లీ స్పీక‌ర్ ఫార్మాట్‌ లో రాజీనామా లేఖ పంపి ఆమోదించుకునే వ‌ర‌కు వంశీ రాజీనామా పెద్ద స‌స్పెన్సే. ఆయ‌న వైసీపీలో చేర‌డం ఖాయ‌మైన నేప‌థ్యంలో రాజీనామా చేయ‌క త‌ప్ప‌దు. ఇక వైసీపీలో చేరేందుకు రెడీ అయిన వంశీ అందుకు ముహూర్తం కూడా చూసుకున్నార‌ని... వ‌చ్చే నెల 3 లేదా 4వ తేదీల్లో ఆయ‌న జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే వైసీపీలో చేరుతున్న‌ట్టు స‌న్నిహితులు కూడా స్పష్టం చేశారు.

Tags:    

Similar News