జ‘గన్’ పై తమ్ముళ్ల రివర్స్ ఫైరింగ్

Update: 2016-07-20 04:31 GMT
గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు తమ్ముళ్లు ఫైరింగ్ షురూ చేశారు. తమ అధినేత మీద విమర్శనాస్త్రాల్ని గురి పెడుతున్న జగన్ పై వారు మూకుమ్మడి దాడికి దిగారు. ఇలా మాటల దాడికి దిగిన వారిలో తెలుగుదేశం నేతలే కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి జంప్ అయిన ‘ తెలుగు తమ్ముళ్లు’ ఉండటం గమనార్హం. జగన్ పై ఒక రేంజ్లోవిమర్శలు చేస్తూనే.. మరోవైపు లాజిక్ మిస్ కాకుండా మాటల దాడికి దిగటం ఈసారి ప్రత్యేకతగా చెప్పాలి. వివిధ ప్రాంతాల్లోపలువురు నేతలు జగన్ పై విరుచుకుపడగా.. ఆసక్తికరంగా ఉన్న కొందరి నేతల విమర్శల్ని చూస్తే..

మంత్రి పల్లె రఘునాథరెడ్డి

‘‘ప్రజలు చైతన్యవంతులయ్యారు. రానున్న ఎన్నికల్లో జగన్ కు గుణపాఠం చెబుతారు. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ పగటి కలలు కంటున్నారు. ఎన్ని గడపలు తట్టినా.. ఎన్ని యాత్రలు చేసినా ఆయనీ జన్మకు ముఖ్యమంత్రి కాలేరు.  గడప గడపకూ వైసీపీ అంటూ తిరగటం చూస్తే నాకైతే సిగ్గుగా ఉంది. అవినీతి పరుడు.. స్వార్థపరుడు.. ప్రజా సంపదను దోచుకున్న ఆయన తగదునమ్మా అంటూ నీతులు వల్లెవేస్తూ ఇంటింటకి ఏ విధంగా పోతున్నాడో అర్థం కావటం లేదు. ఇన్ని కోట్ల అవినీతి చేసి దేశానికి ద్రోహం చేసిన జగన్ లాంటి వ్యక్తి ఇంటింటికీ వస్తున్నానని చెప్పుకోవటం ఆశ్చర్యంగా ఉంది. ఆయన వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో నిలదీయాలి. అలాంటి అసమర్థుడు.. అవినీతిపరుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు జగన్ తిరస్కరించారు’’

కిడారి సర్వేశ్వరరావు

‘‘స్విస్ ఛాలెంజ్ విధానాన్ని కొన్ని పత్రికలు తప్పు పడుతున్నాయి. అదేమీ చంద్రబాబు కనిపెట్టింది కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహరావు ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి కూడా ఇదే విధానంలో చేపట్టారు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిన వారంతా ఇప్పుడు దోషుల్లా కనిపిస్తున్నారు. నేను ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాక.. తన పత్రిక ద్వారా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రెండేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పని చేశా. కానీ.. అప్పుడేమీ అవినీతి ఆరోపణలు చేయలేదు. పార్టీ మారి టీడీపీలోకి చేరిన రెండు నెలలకే అవినీతిపరుడిని అయిపోయానంటూ నాపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు. నాకు 1.5ఎకరాల కంకరరాయి క్వారీ ఉంది. అది జగన్ కు మైనింగ్ లా కనిపిస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని హైదరాబాద్.. బెంగళూరుల్లో వందలాది ఎకరాల్లో ఇళ్లు.. ఇడుపుల పాయలో భూములు సంపాదించుకున్న జగన్.. నేను గిరిజన ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే కుళ్లుకుంటున్నారు. నాకు గంజాయి మాఫియాతో లింకులు ఉన్నట్లు ఆయన పత్రికలో తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డితో ఎవరికి లింకులు ఉన్నాయో ప్రజలకు తెలుసు. ఆస్తులన్నీ ఈడీ అటాచ్ చేసినా జగన్ కు బుద్ధి రావటం లేదు’’

డొక్కా మాణిక్య వరప్రసాద్

‘‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తే టర్కీ ప్రజలు అక్కడి సైనిక తిరుగుబాటుకు బుద్ధి చెప్పినట్లే.. ఆంధప్రదేశ్ లో ప్రజలు జగన్ కు సమాధానం చెబుతారు. జగన్ ఎప్పుడూ మాట్లాడినా ఏడాదిలో ఎన్నికలు వస్తాయని.. ఆ తర్వాత తానే ముఖ్యమంత్రినని చెబుతారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించేటట్లున్నాయ్’’
Tags:    

Similar News