మా మీద కేసు పెడితే.. మీ మీదా కేసు పెట్టాలిగా.. టీడీపీ కొత్త వాదన

Update: 2021-03-18 04:36 GMT
గడిచిన రెండు రోజులుగా ఏపీ రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారటం తెలిసిందే. అమరావతి భూముల సేకరణ వేళ.. ఎస్సీఎస్టీలకు కేటాయించిన భూముల్ని మోసపూరితంగా లాక్కున్నారంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ అధికారులు స్పందించి.. హైదరాబాద్ లోని విపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ఈ నెల 23న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పారు. లేకుంటే అరెస్టు ముప్పు ఉంటుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. తమ అధినేతకు నోటీసులు ఇవ్వటాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తాజాగా పెట్టిన కేసులు రాజకీయ ప్రేరేపితమే తప్పించి.. మరింకేమీ లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్న టీడీపీ.. ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలన్న విషయాన్ని చెబుతున్నారు. అదే సమయంలో.. వైసీపీ ప్రభుత్వం తమను వేధిస్తుందన్న భావన ప్రజల్లో వ్యక్తమయ్యేలా కొత్త తరహా వాదనకు తెరతీశారు.

ప్రభుత్వ శాఖల తనిఖీ పూర్తి అయిన తర్వాతే రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల పరిహారానికి జీవో జారీ అయ్యిందని.. దాన్ని మంత్రివర్గం కూడా ఆమోదించిన విషయాన్ని మర్చిపోకూడదు పలువురు తమ్ముళ్లు పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఈ ఇష్యూలో చంద్రబాబు చేసింది తప్పే అయితే.. తాజాగా వైసీపీ ప్రభుత్వం కూడా తప్పు చేస్తున్నట్లేనని చెబుతున్నారు.

అదెలానంటే.. తాజాగా విశాఖ ప్రాంతంలో భూసమీకరణ చేపడుతూ.. అందుకు పరిహారాన్ని నిర్ణయిస్తూ జీవో జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బాబుపై కేసు పెట్టిన పక్షంలో.. జగన్ మీదా ఇదే అంశంపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ న్యాయ నిపుణుల అంచనా ప్రకారం.. బాబుపై సీఐడీ పెట్టిన కేసు నిలబడే అవకాశం లేదంటున్నారు. అదే సమయంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తే.. వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందేమో?
Tags:    

Similar News