టచ్ లో 18 ఎమ్మెల్యేలు.. ఎందుకు చేర్చుకోవట్లేదో?

Update: 2019-07-05 06:53 GMT
సునీల్ దియోధర్.. బీజేపీ జాతీయ కార్యదర్శి..పైగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జి. ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేల్లో 18 మంది తమతో టచ్ లో ఉన్నారని.. త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా ఏపీలో తీవ్ర దుమారం రేపాయి. చర్చనీయాంశమయ్యాయి.

అయితే ఫలితాలు వచ్చి నెలరోజులు దాటింది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి జోరుగా ముందుకెళుతోంది. నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను లాగేసిన బీజేపీ... త్వరలోనే టీడీపీ ఎమ్మెల్యేలను లాగేస్తామని ప్రకటన చేసింది. పోయిన నలుగురు టీడీపీ ఎంపీలు పారిశ్రామికవేత్తలు.. ఈడీ - ఐటీ కేసుల్లో ఇరుకున్నారు. వారు బీజేపీలో చేరకపోతే వారికే ప్రమాదం.. అందుకే చేరిపోయారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

అయితే మరి 18మంది ఎమ్మెల్యేలను లాగేస్తామన్న బీజేపీ మాటలను మాత్రం కొట్టిపారేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఇన్ని రోజుల నుంచి చెబుతున్నా ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ బాట పట్టకపోవడాన్ని వారు ఎండగడుతున్నారు. టచ్ లో ఉన్నారని బీజేపీ చెప్తుంటే ఎందుకు చేర్చుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.

టీడీపీపై ప్రతీకారంతో బీజేపీ బూచీ చూపించి కోతలు కోస్తోందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఏపీలో ఉనికి లేని బీజేపీలో చేరే అవకాశాలే లేవని టీడీపీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. బీజేపీ కావాలనే టీడీపీని డిఫెన్స్ లో నెట్టడానికి ఇలా ప్రకటనలు చేస్తోందని టీడీపీ వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి. 18మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం వట్టిమాటేనని స్పష్టం చేస్తున్నారు.
Tags:    

Similar News