టీడీపీ నేతలు.. అక్కడ అసలున్నారా?

Update: 2020-07-29 15:30 GMT
గెలిచినా.. ఓడినా ప్రజల్లో ఉండేవాడే నాయకులు.. ఒకప్పుడు జిల్లా నిండా మంత్రులు, ఎమ్మెల్యేలు.. నాయకులతో పసుపు జెండాలు రెపరెపలాడాయి. కానీ ఇప్పుడు జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అధికారంలో చెలరేగి పోయిన వారందరూ ఇప్పుడు ప్రతిపక్షంలో ఓడిపోయి దూరంగా జరిగుతున్నారు. దీంతో కార్యకర్తలు, నేతలు తలోదారి చూసుకుంటున్నారు. టీడీపీకి కంచుకోట అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడన్న ఆవేదన కార్యకర్తల్లో ఉంది.

ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎవరిని గెలిపిస్తే వారిదే రాజకీయ అధికారం అన్న పేరుంది. అక్కడి ప్రజలు ఏ పార్టీకైనా క్లీన్ స్వీప్ స్పష్టమైన మెజార్టీ ఇస్తారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి ప్రజలు గెలిపించిన పార్టీనే అధికారంలోకి వచ్చింది. అంతకుముందు కూడా అంతే.

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి అధికారం కొల్లగొట్టింది. 2019లో అదే టీడీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమై వైసీపీ ప్రభంజనం వీచింది. అధికారం జగన్ కు దక్కింది.

టీడీపీకి 2019 ఎన్నికల్లో కేవలం ఉండి, పాలకొల్లుల్లో మాత్రమే గెలవగా.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో పులిలా విజృంభిస్తూ పాలకొల్లుకే పరిమితమైపోయారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు ఉన్నారో లేరో తెలియని పరిస్థితి అని తెలుగు తమ్ముళ్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక టీడీపీ మాజీ మంత్రి పితాని ఈఎస్ఐ స్కాంలో ఇరుక్కొని మౌనం దాల్చారు. మరో సీనియర్ జవహర్ అయితే రాజకీయాల్లోనే యాక్టివ్ గా లేరు. ఇక చింతమనేని కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ పులిలాంటి వ్యక్తి వైసీపీ పాలనలో పిల్లిలా మారిపోయారు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఉన్నారా లేరా అన్నట్టుగా ఉన్నారు. ఇలా 2014లో గెలిచి చక్రం తిప్పిన వారంతా ఐదేళ్లకే కనుమరుగు కావడం టీడీపీ క్యాడర్ లో నిరాశనిసృహను మిగులుస్తోంది. చంద్రబాబు ఎంత బూస్టప్ ఇచ్చినా నేతలు మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాకుండా టీడీపీని జిల్లాలో బలహీన పరుస్తున్నారని టీడీపీ క్యాడర్ వాపోతోంది.
Tags:    

Similar News