తెలుగుదేశం అలా మాట్లాడటం..నవ్వులపాలవ్వడం కాదా?

Update: 2019-09-27 05:43 GMT
రుణమాఫీ హామీని ఇచ్చింది ఎవరు? దాన్ని అమలు చేయడానికి ఐదు విడతలు అంటూ మాట్లాడింది ఎవరు? రుణమాఫీ జరిగిపోయిందంటూ ప్రకటనలు చేసింది ఎవరు?  తీరా ఇప్పుడు రెండు విడతల మాఫీని వైఎస్ జగన్ అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నది ఎవరు?  ఈ  ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం. అది తెలుగుదేశం పార్టీ.

2014 అసెంబ్లీ ఎన్నికల మునుపు తెలుగుదేశం పార్టీ రుణమాఫీ హామీ ఇచ్చింది. తమకు అధికారం ఇస్తే చాలు.. మొత్తం రుణాలు మాఫీ అని తెలుగుదేశం పార్టీ  వాళ్లు అప్పుడు ప్రకటించారు. రైతులను పూర్తిగా రుణవిముక్తులను చేస్తామంటూ - తాకట్టులోని బంగారాన్ని కూడా విడిపిస్తామంటూ అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు హడావుడి చేశారు. ఆ ఎన్నికల ముందు జగన్ మాట్లాడుతూ..రుణమాఫీ హామీ జరిగే పని కాదని స్పష్టం చేశారు.

రుణమాఫీ హామీని ఆయన ఇవ్వలేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రుణమాఫీ హామీని జగన్ ఇవ్వలేదు. ఇక తెలుగుదేశం కథ చూస్తే.. అధికారంలోకి రాగానే రుణమాఫీకి షరతులు విధించారు. అనేక మంది రైతులను  అనర్హులుగా ప్రకటించారు. అర్హులుగా తేలిన వారికి కూడా ఐదు విడతల్లో మాఫీ అన్నారు.

ఆ ఐదు విడతలూ ఐదు సంవత్సరాల్లో ఇస్తామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ చేతిలో ఐదేళ్లు అధికారం ఉండింది. అయితే మాఫీ మాత్రం మూడు విడతలే చేశారని ఇప్పుడు చెబుతున్నారు. అధికారం చేతిలో ఉన్నంతసేపూ.. రుణమాఫీ జరిగిపోయిందని చెప్పిన తెలుగుదేశం వాళ్లు ఇప్పుడు మాత్రం మూడు విడతల మాఫీనే తాము చేసినట్టుగా చెబుతున్నారు.

మిగిలిన రెండు  విడతలనూ జగన్ చేయాలని చంద్రబాబున నాయుడుతో సహా యనమల రామకృష్ణుడు తదితర నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ తో తెలుగుదేశం నవ్వులపాలవుతోంది. తాము చేసి చూపిస్తామంటూ ఓట్లు వేయించుకుని - ఐదేళ్లు అధికారంలో ఉండి.. ఇప్పుడు  ఆ పని చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉండటం ప్రహసనంగా మారింది. ఈ విషయంలో రైతులు  కూడా తెలుగుదేశం తీరును చూసి నవ్వుకుంటున్నారు.తమ చేతగాని తనాన్ని తెలుగుదేశం  వాళ్లు ఇలా చాటుకుంటున్నారని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు.
Tags:    

Similar News