విశాఖపై టీడీపీ సరికొత్త డిమాండ్

Update: 2020-01-21 06:48 GMT
ఏపీకి 3 రాజధానులు చేస్తానని చెప్పిన జగన్ దాన్ని కంకణం కట్టుకొని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టించి ఆమోదం తెలిపారు. ఇన్నాళ్లు తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష టీడీపీ ఇప్పుడు ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. 3 రాజధానులపై చేసేందేం లేకపోవడంతో తాజాగా టీడీపీ సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చింది.

విశాఖను రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీపై ఉత్తరాంధ్రలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త డిమాండ్ ను టీడీపీ తెరపైకి తెచ్చింది.

ఉత్తరాంధ్రకు పెద్ద సిటీ - వెనుకబడిన మూడుజిల్లాల ప్రధాన కేంద్రమైన విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని టీడీపీ నేతలు తాజాగా డిమాండ్ చేశారు. అలాగే టాలీవుడ్ మొత్తాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి విశాఖలో పెట్టి తెలుగు సినిమా రాజధానిగా మార్చాలని తెలుగు తమ్ముళ్లు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. విశాఖ వ్యాప్తంగా టీడీపీ నేతలు కలిసి ఆర్థిక, సినిమా ఇండస్ట్రీ రాజధానిగా విశాఖ చేయాలని ఫ్లెక్సీలు - బ్యానర్లు పెట్టి కొత్త ఉద్యమానికి తెరతీశారు.

అయితే విశాఖకు పరిపాలన రాజధాని చేయడాన్ని మాత్రం టీడీపీ వ్యతిరేకిస్తుండడం విశేషంగా మారింది. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను, ఆర్థిక, సినిమా ఇండస్ట్రీ  రాజధానిగా మార్చాలని కొత్త ప్రతిపాదన తేవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News