వంశీ - గిరి.. ఇంకా ఈ రూట్లో ఎంద‌రు?

Update: 2020-01-01 01:30 GMT
తెలుగుదేశం పార్టీకి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిందే 23 సీట్లు. త‌న చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత దారుణ‌మైన ఫ‌లితాన్ని పొందింది తెలుగుదేశం పార్టీ. ఐదేళ్ల చంద్ర‌బాబు నాయుడు పాల‌న ఇచ్చిన ప్ర‌తిఫ‌లం అది. ఆ నంబ‌ర్ కు టీడీపీకి ఉన్న అభినాభావ సంబంధం ఏమిటో కూడా ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

గ‌త ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తే, చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున అంతే మంది ఎమ్మెల్యేలు నెగ్గారు. అలా బ్యాలెన్స్ అయ్యింది వ్య‌వ‌హారం. అయితే ఇప్పటికే ఆ 23 మందిలో ఒక‌రు మైన‌స్ అయ్యారు. కాదు ఇద్ద‌రు మైన‌స్ అయిన‌ట్టే!

తెలుగుదేశం పార్టీ తీరును ఖండిస్తూ, చంద్ర‌బాబు మీద విమ‌ర్శ‌లు చేసి, సీఎం జ‌గ‌న్ ను క‌లిసిన వ‌ల్ల‌భ‌నేని వంశీని ఇప్ప‌టికే టీడీపీ స‌స్పెండ్ చేసింది. దీంతో ఆయ‌న‌కు స్వ‌తంత్ర ఎమ్మెల్యేగా కొన‌సాగే అవ‌కాశం ఏర్ప‌డింది. ఇప్పుడు ఇదే రూట్లో సాగుతున్నాడు మ‌ద్దాలి గిరి. ఈయ‌న కూడా ఇప్ప‌టికే చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు, జ‌గ‌న్ పై ప్ర‌శంసలు మొద‌లుపెట్టారు. ఈయ‌న‌ను కూడా రేపోమాపో తెలుగుదేశం పార్టీ స‌స్పెండ్ చేయ‌వ‌చ్చు.

త‌ద్వారా ఆయ‌న‌కూ స్వ‌తంత్రుడిగా కొన‌సాగే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఈ రూట్లో ప‌య‌నించే వాళ్లు వీరిద్ద‌రేనా.. ఇంకా ఉంటారా.. అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశంగా మారింది. ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీలో కొంత‌మంది  ఎమ్మెల్యేలు అసంతృప్తులుగా, కామ్ గా ఉన్నారు. కాబ‌ట్టి.. ఈ రూట్లో మ‌రింత మంది ప‌య‌నించే అవ‌కాశాలు లేక‌పోలేదు. కొంద‌రు బీజేపీ వైపు చూస్తూ ఉన్నార‌ని, మ‌రి కొంద‌రు జ‌గ‌న్ మీద ఆశ‌ల‌తో ఉన్నార‌ని తెలుస్తోంది.

అయితే.. ఉప ఎన్నిక‌ల‌కు రెడీ అయ్యి, రాజీనామాతో వ‌స్తే స్వాగ‌తం అని జ‌గ‌న్ అంటున్నారు. ఆ ఒక్క ష‌ర‌తూ లేక‌పోతే.. ఈ పాటికి తెలుగుదేశం పార్టీ చాలా వర‌కూ ఖాళీ అయిపోయేది. ఆ ష‌ర‌తే తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత హోదా నిల‌బెడుతూ ఉంది. అయితే స్వ‌తంత్ర ఎమ్మెల్యేలుగా కొన‌సాగే అవ‌కాశం మాత్రం చంద్ర‌బాబు నాయుడుకు ఆ హోదాను కొశ్చ‌న్ మార్క్ అయ్యేలా చేస్తోంద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News