శుద్ధి గోల పీక్స్ కు వెళ్లిన‌ట్లుందిగా!

Update: 2017-06-23 06:19 GMT
నిజ‌మే... ఇప్పుడు శుద్ధి, సంప్రోక్ష‌ణ గోల ప‌తాక స్థాయికి వెళ్లిపోయింది. అధికార, విప‌క్షాలు త‌ర‌చూ ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ జ‌నానికి చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నారు. అయినా శుద్ధి - సంప్రోక్ష‌ణ వంటి కార్య‌క్ర‌మాలు ఆల‌యాల్లో జ‌రిగితే బాగుంటుంది గానీ... బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అది కూడా వైరి వ‌ర్గాలను కించ‌ప‌రిచేందుకు ఈ కార్య‌క్ర‌మాలు చేస్తుండ‌టాన్ని జ‌నం ఏవ‌గించుకుంటున్నారు. అయినా కూడా రాజ‌కీయ వైరి వ‌ర్గాల‌పై ఆయా పార్టీలు ఈ త‌ర‌హా వైఖ‌రిని మాత్రం వ‌దులుకోవ‌డం లేదు.

ఏపీలో ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండ‌గా, వైసీపీ విప‌క్షంలో ఉంది. అసెంబ్లీలో మూడో పార్టీగా బీజేపీ ఉన్నా... ఆ పార్టీ అధికార పార్టీ టీడీపీతో మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అంటే ఆ వైపున రెండు పార్టీలు ఉంటే... వాటికి ఎదురుగా ఒకే ఒక్క పార్టీ ఉంది. ఈ క్ర‌మంలో అప్పుడెప్పుడో రాజ‌ధాని ప్రాంతంలో విప‌క్ష నేత హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌టించారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న రుచించ‌ని టీడీపీ వ‌ర్గాలు... జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌తో ఆ ప్రాంతానికి మ‌కిలి అంటింద‌ని, శుద్ధి చేసేయాల్సిందేనని కొత్త రాగం అందుకుని ఆల‌యాల్లో సంప్రోక్ష‌ణ చేసిన మాదిరిగానే ప‌సుపు నీళ్లు చ‌ల్లి - వేద మంత్రాలు ప‌ఠించి త‌న‌దైన కొత్త త‌ర‌హా ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఈ చ‌ర్య‌పై విప‌క్షం కూడా కాస్తంత ఘాటుగానే స్పందించింది. జ‌గ‌న్ ప‌ర్య‌టించిన ప్రాంతాన్ని శుద్ధి చేసిన టీడీపీ నేత‌లు ఆ ప్రాంతానికి మ‌కిలి అంటించార‌ని, ఆ మ‌కిలి పోవాలంటే శుద్ధి చేయాల్సిందేన‌ని వాదిస్తూ వారు కూడా టీడీపీ నేత‌ల మాదిరే సంప్రోక్ష‌ణ చేపట్టారు. అక్క‌డితో ఆ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగింది. అయితే కొత్త ప‌ద్ధ‌తికి శ్రీ‌కారం చుట్టింది తామేనన్న భావ‌న‌తో జ‌గ‌న్ ప‌ర్య‌టించిన మ‌రికొన్ని ప్రాంతాల్లోనూ శుద్ధి చ‌ర్య‌లు చేప‌ట్టిన టీడీపీ త‌న వైఖ‌రిని కొన‌సాగించ‌గా, వైసీపీ ఆ త‌ర్వాత దానిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

తాజాగా నిన్న *సేవ్ విశాఖ‌* పేరిట నిర్వ‌హించిన ధ‌ర్నాలో పాల్గొనేందుకు వైఎస్ జ‌గ‌న్ విశాఖ‌కు వెళ్లారు. ధ‌ర్నాలో పాల్గొని టీడీపీ స‌ర్కారు భూదందాల‌పై నిప్పులు చెరిగారు. ఆ కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని జ‌గ‌న్ అక్క‌డి నుంచి వ‌చ్చేసిన వెంట‌నే.. రంగంలోకి దిగిన టీడీపీ నేత‌లు ధ‌ర్నా ప్రాంతాన్ని శుద్ధి చేశారు. పెద్ద సంఖ్య‌లో కార్య‌కర్త‌ల‌తో క‌లిసి ఆ ప్రాంతానికి వ‌చ్చిన టీడీపీ స్థానిక నేత‌లు ధ‌ర్నా జ‌రిగిన ప్రాంతంపై ప‌సుపు నీళ్లు చ‌ల్లారు. ఆ త‌ర్వాత వేద పండితులు మంత్రాలు చ‌దువుతుండ‌గా ఆవు దూడ‌ల‌ను ఆ ప్రాంతంలో తిప్పి గోపంచ‌కం చ‌ల్లారు. త‌ద‌నంత‌రం ధూపం వేయించి ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు. ఈ మొత్తం తతంగాన్ని చూసిన జ‌నం రాజ‌కీయ పార్టీల‌కు ఇదేం పోయే కాలం వ‌చ్చింద‌ని వారిలో వారే మ‌ద‌న‌ప‌డుతూ వెళ్లార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News