'అన్నయ్య'తో 'తమ్ముడు'కి కష్టాలు

Update: 2015-07-08 11:17 GMT
రాజకీయంగా అనుభవం లేకపోయినా... పదవులు లేకపోయినా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై భారీ అంచనాలు మాత్రం ఉన్నాయి. దేశస్థాయి నేతలతో అనుబంధాలున్న పవన్‌ కళ్యాణ్‌కు అత్యధిక ప్రాధాన్యం కూడా దక్కుతోంది. ఆయన కూడా రాజకీయ రంగంలో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే.... ఆయన రాజకీయ ప్రయాణంలో అన్న చిరంజీవి పెద్ద మైనస్‌ పాయింట్‌ గా మారుతున్నారు. పవన్‌ ఎవరిని వేలెత్తి చూపినా వారు చిరంజీవిని ఉదాహరణగా చూపించి పవన్‌ ను ఇరుకునపెడుతున్నారు. తాజాగా కూడా పవన్‌ అదే పరిస్థితి ఎదుర్కొన్నారు.  తెలుగు రాష్ట్రాల్లో పరిణామలపై స్పందించిన ఆయన ఏపీ ఎంపీల తీరుపై మండిపడ్డారు. వారు వ్యాపారాలకే పరిమితమవుతున్నారు కానీ ఏపీ ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. దానిపై మండిపడుతున్న తెలుగుదేశం ఎంపీలు పవన్‌ను ఒక రేంజిలో వేసుకున్నారు. ఆయన ఏ మాత్రం ఊహించని విధంగా పవన్‌ సోదరుడు, రాజ్యసభ ఎంపీ చిరంజీవి వ్యవహారాన్ని లేవనెత్తారు.

    'మీ అన్న చిరంజీవి కూడా ఎంపీయే.. ఆయనకూ వ్యాపారాలు ఉన్నాయి... దాని సంగతేంటి' అంటూ పవన్‌ను ఇరుకునపెట్టేశారు. గతంలోనూ పవన్‌ చిరంజీవి కారణంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు.. కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు.. ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి కూడా పవన్‌ అన్న కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగారు. అయితే... చిరంజీవి ఆ పార్టీని గంగలో కలిపేసి వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుని కాంగ్రెస్‌లో చేరి కేంద్రంలో మంత్రి పదవి కొట్టేశారు. ఆసమయంలో పవన్‌ ఆయనతో విభేదించారు కూడా. కానీ, ప్రజలు మాత్రం చిరంజీవి తరపున వకాల్తా పుచ్చుకున్న పవన్‌నూ ప్రశ్నించారు.

    అంతేకాదు... చిరంజీవి ప్రస్తుత రాజకీయ సంబంధాలు... విభజన సమయంలో ఆయన వ్యవహారం.. విభజన తరువాత పరిణామాల్లో ఆయన మౌనం వంటివన్నీ పవన్‌కు అడుగడుగునా ఇబ్బంది పెట్టేవే. వీటన్నిటినీ ఆయన ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News