తమ్ముళ్లు.. రాజీనామా తప్పించి మరో డిమాండ్ లేదా?

Update: 2020-01-29 14:30 GMT
రాజకీయాలన్నాక ఒక పద్దతి పాడు ఉండాలి. అదేమీ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న వైనం చూస్తే చిరాకు మాత్రమే కాదు.. మరీ ఇంత చిల్లర రాజకీయాలేంట్రా బాబు అన్న భావన కలగటం ఖాయం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారాన్నిచేపట్టి సరిగ్గా ఏడాది కాలేదు. ఏడాదికి ఇంకా నాలుగైదు నెలల టైముంది కూడా. అధికారం లేకుండా నిమిషం కూడా గడవదన్నట్లుగా తెలుగు తమ్ముళ్ల తీరు ఉంది. విషయం ఏదైనా సరే.. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలంటూ వారు చేస్తున్న డిమాండ్ కామెడీగా మారిపోతోంది.

ఎన్నికల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించి.. ప్రతిపక్షాలకు కనీస గౌరవం దక్కని రీతిలో సీట్లు వచ్చిన వేళ.. ప్రజాతీర్పునకు అనుగుణంగా కామ్ గా ఉండాల్సింది పోయి.. అందుకు భిన్నంగా అదే పనిగా రాజీనామా డిమాండ్ చేస్తున్న తెలుగు తమ్ముళ్ల తీరు ఏపీ ప్రజలకు ఇరిటేషన్ తెప్పిస్తుందని చెప్పక తప్పదు.  

ఇసుక కొరత మొదలు మూడు రాజధానుల విషయం వరకూ ప్రతి విషయానికి సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలని.. ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తప్పించి మరొకటి లేకుండా పోతోంది తెలుగు తమ్ముళ్లకు. తాజాగా వైఎస్ వివేకా హత్య విషయంలో ఆయన కుమార్తె సునీత హైకోర్టు గడప ఎక్కి.. పిటిషన్ దాఖలు చేసిన వేళ.. టీడీపీ నేతల నోళ్లు మళ్లీ ఓపెన్ అయ్యాయి.

తన తండ్రి హత్యపై సీబీఐ విచారణ జరపాలని సీఎం జగన్ చెల్లెలు కోర్టుకు వెళ్లిందని.. చెల్లికి న్యాయం చేయలేని అన్న జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని వ్యాఖ్యానించారు. పంచుమర్తి అనురాధ మాటనే తీసుకుంటే..వివేక హత్య జరిగింది చంద్రబాబు హయాంలో. ఇప్పుడీ డిమాండ్ చేస్తున్న అనురాధ.. హత్య జరిగిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన విచారణ చేయించి.. ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చి ఉంటే.. ఈ రోజు ఈ తిప్పలే ఉండేవి కావు కదా? మరి.. నేరం జరిగింది తమ హయాంలో అయినప్పుడు .. ప్రభుత్వం దిగిపోయే లోపు ఈ హత్య కేసును ఎందుకు చేధించలేకపోయారన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తే బాగుంటుందేమో? ప్రతి విషయానికి సీఎం జగన్ రాజీనామా చేయటం అన్న డిమాండ్ ను పక్కన పెట్టి..తెలుగుతమ్ముళ్లు కాస్త కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందేమో?
Tags:    

Similar News