డేటా వార్ లో కొత్త ట్విస్ట్‌.. టీ స‌ర్కారుపై కేసు?

Update: 2019-03-07 07:13 GMT
గ‌డిచిన నాలుగైదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన డేటా చౌర్యం వ్య‌వ‌హారం మ‌రో మ‌లుపు తిరిగింది. ఒక ఐటీ కంపెనీలో జ‌రిపిన సోదాలు.. అనంత‌రం ఈ ఇష్యూ ఏపీ అధికార ప‌క్షం వైపు వేలు చూపించ‌టం.. అనంత‌రం ఈ వ్య‌వ‌హారంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు లోకేశ్ ఉన్నారన్న ఆరోప‌ణలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ఈ వ్య‌వ‌హారంపై తెలంగాణ స‌ర్కారుపై ఏపీ టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.

చివ‌ర‌కు డేటా చౌర్యం వ్య‌వ‌హారం రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చేస్తోంది. నిన్న‌టి వ‌ర‌కూ మాట‌ల యుద్ధం కాస్తా.. ఇప్పుడు ఒక‌రిపై ఒక‌రు కేసులు పెట్టుకునే వ‌ర‌కూ వెళ్లి... వ్య‌వ‌హారం మ‌రింత ముదిరేలా చేస్తోంది. ఏపీ ప్ర‌జ‌ల‌కు చెందిన కీల‌క‌మైన డేటాను టీడీపీ చోరీ చేసింద‌న్న కోణంలో తెలంగాణ‌లోని టీ ఆర్ ఎస్ స‌ర్కారు విచార‌ణ జ‌రుపుతుంటే.. మ‌రోవైపు ఏపీ స‌ర్కారు మ‌రో నిర్ణ‌యాన్ని తీసుకుంది.

ఏపీకి సంబంధించిన డేటాను తెలంగాణ ప్ర‌భుత్వం చోరీ చేసిందంటూ కేసీఆర్ స‌ర్కారు మీద కేసు పెడుతున్నారు. అంతేకాదు.. టీఆర్ ఎస్ స‌ర్కారు మీద ప‌రువు న‌ష్టం దావా వేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ విష‌యంపై మాట్లాడేందుకు టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు.. ఎమ్మెల్సీ జూపూడి ప్ర‌భాక‌ర్ త‌దిత‌ర నేత‌లు గుంటూరు రూర‌ల్ ఎస్ ఐని క‌లిసి ఫిర్యాదు చేశారు.

అంతేకాదు.. బెంగ‌ళూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచే ఫామ్ 7 ద‌ర‌ఖాస్తులు పెద్ద ఎత్తున వ‌చ్చాయ‌ని జూపూడి ఆరోపించారు. త‌ప్పుడు ఆప్లికేష‌న్లు పెట్టిన వారి మీద కేసు పెడ‌తామ‌న్న ఆయ‌న‌.. టీడీపీకి చెందిన డేటాను టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం చోరీ చేసింద‌ని.. దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. రెండు ప్ర‌భుత్వాలు పోటీపోటాగా కేసులు న‌మోదు చేయ‌టం ద్వారా.. రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మార‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.
    

Tags:    

Similar News