కేసీఆర్ పై ప్రేమతో.. మీ సండ్ర

Update: 2019-02-23 09:25 GMT
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. ఎన్నికల అనంతరం టీడీపీకి చెందిన ఆ ఇద్దరు ఎమ్మల్యేలు టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి ఆ ఇద్దరు నేతలు ఖండించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజాకూటమి నుంచి గెలుపొందిన సండ్ర  వెంకట వీరయ్యపై ఈ ప్రచారం మొదటి నుంచి ఉన్నా టీఆర్ఎస్ లో చేరే విషయాన్ని దాటవేస్తూ వస్తున్నారు.

కాగా ఇటీవల సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వానికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్ ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ప్రజలు విశ్వసించినందువల్లే అధికారం కట్టబెట్టారని అన్నారు. అంతేకాకుండా టీఆర్ ఎస్ ప్రవేశపెట్టిన గురుకుల విద్యాలయ వ్యవస్థ - ఎస్సీ - ఎస్టీ సబ్ ప్లాన్ అమలు - రైతు బంధు పథకం - ఆసరా పింఛన్లు వంటి వాటిపై సండ్ర ప్రశంసలు కురిపించారు. ఈ పథకాలను మరింత విస్తృత పరిచాలని కోరారు.

దళితుల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు. ఇటీవల నారాయణపేట - ములుగు జిల్లాలను ప్రకటించిన మాదిరిగానే సత్తుపల్లి - అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి ఓ కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు.

తన ప్రసంగంలో ఎక్కడా కూడా టీఆర్ఎస్ పార్టీని సండ్ర ఎండగట్టినట్టు కనిపించలేదు. దీంతో సండ్ర టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. సండ్ర టీఆర్ఎస్ చేరేందుకు లైన్ క్లియర్ అయిందని పలువురు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీన్ని బట్టి అయిదో ఎమ్మెల్సీ కోసం బరిలో దిగిన టీఆర్ఎస్ కు సండ్ర మద్దతివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

 ఏదిఏమైనా ఎంపీ ఎన్నికల ముందే సండ్ర ప్రజాకూటమిని వీడితే ఆ పార్టీలకు కొంతమేర ఇబ్బంది కలుగడం ఖాయంగా కనిపిస్తుంది. మరీ సండ్ర వీరయ్య కారు ఎక్కుతారా? లేక సైకిల్ నే నమ్ముకుంటారా వేచిచూడాలి.


Tags:    

Similar News