ఎమ్మెల్యేలకు లోకేష్‌ షాక్‌

Update: 2015-04-10 13:30 GMT
దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించని చందంగా తయరయింది ఆంధ్రప్రదేశ్‌ లోని తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి. పార్టీకోసం పనిచేసిన వారికోసం నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామని, మహానాడులోగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. తను అధికారిక పనుల్లో బిజీగా ఉన్నందున ఈ పనులను తన కుమారుడు లోకేష్‌ పర్యవేక్షిస్తారని చెప్పారు. నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు పంపించాలని బాబు సూచించారు.



బాబు ప్రకటనతో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు సంబరపడ్డారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్ల పదవులు, స్థానిక దేవాలయాల పాలకమండల్లు భర్తీ చేస్తున్నందున తమకు అవకాశం దొరుకుతుందని భావించారు. అయితే ఇక్కడే సీన్‌ రివర్స్‌ అయింది.



తన వద్దకు వచ్చిన ప్రతిపాదనలను లోకేష్‌ ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలకు ఆయన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు పంపించిన ప్రతిపాదనల్లో చాలా మేరకు వారికి ఇష్టం వచ్చిన వారి పేర్లే ఉన్నాయి తప్ప పార్టీ కోసం కష్టపడ్డ వారి పేర్లు లేవని లోకేష్‌ గమనించారు. పార్టీకోసం పాటుపడ్డ వారికి ప్రాధాన్యం ఇస్తూ లిస్టు పంపించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తిచేయాలని, మహానాడులోగా పదవుల భర్తీ ముగిద్దామని చెప్పారు.చినబాబు మాటను తెలుగుతమ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి మరి.
Tags:    

Similar News