మండలి రద్దు ఇప్పట్లో కుదరదు ... ఎంపీ నాని కీలక వ్యాఖ్యలు !

Update: 2020-01-28 07:14 GMT
ఏపీలో శాసనమండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చేసిన ఈ తీర్మానాన్ని వీలైనంత త్వరగా కేంద్రానిని ఆ తీర్మానం పంపి ,సాధ్యమైనంత త్వరలో ఆమెదం పొందేలా చూడాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వైసీపీ , తమ ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తోంది. అదే సమయంలో టీడీపీ మాత్రం కనీసం రెండేళ్ల సమయం పడుతుందని, అప్పటి వరకు సభ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని చెబుతోంది. ప్రస్తుతం కేంద్రంలో నెలకొన్న పరిస్థితులను విశ్లేషిస్తున్న నిపుణులు మాత్రం ఆరు నెలల నుండి సంవత్సరం వరకు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అయితే, ఈ వ్యవహారం పై తాజాగా స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. గత నెలలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రస్తావించారు. అసలు ఈ బిల్లు ఇప్పట్లో పార్లమెంట్ ముందుకొచ్చే అవకాశమే లేదంటున్నారు. శాసన మండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ ముందుకు తీసుకువెళ్ళే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. ఇటువంటి తీర్మానాలను తప్పుబడుతూ రాజ్యసభ స్టాండింగ్‌ కమిటీ ఒక నివేదిక సమర్పించిందని, ఆ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా న్యాయ శాఖ మళ్ళీ ఒక రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాన్ని చేపట్టి పార్లమెంటుకు పంపదని ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌ లో ఎగువ సభను పునరుద్ధరించాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ నుంచి వచ్చిన తీర్మానాన్ని రాజ్యసభలో స్టాండింగ్‌ కమిటీ కి నివేదించారని తెలిపారు. శాంతారాం నాయక్‌ అధ్యక్షతన ఏర్పాటైన ఈ స్టాండింగ్‌ కమిటీ 2013 డిసెంబరు 9న తన నివేదికను రాజ్యసభకు సమర్పించిందని వివరించిన నాని... ఈ స్టాండింగ్‌ కమిటీ లో ప్రఖ్యాత న్యాయవాదులు రాంజఠ్మలానీ, అభిషేక్‌ సింఘ్వీ, పినాకీ మిశ్రా తదితరులు ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఒక ప్రభుత్వం వచ్చి పెట్టడం.. మరో ప్రభుత్వం వచ్చి తీసివేయడం దుస్సాంప్రదాయంగా అందులో అభివర్ణించినట్లు వివరించారు. వాటికి అసలు ఆ అధికారం లేదని..నియమ, నియంత్రణలను పాటించడం కోసం దేశంలో ప్రతి రాష్ట్రంలో విధిగా ఎగువ సభలను ఏర్పాటు చేయాలనేది ఆ కమిటీ సిఫార్సులుగా చెప్పుకొచ్చారు. దీనివల్ల బిల్లులపై మరింత అర్థవంతమైన చర్చలు జరుగుతాయని కమిటీ సిఫార్సు చేసిందని వివరించారు. ఇప్పటికి 10 రాష్ట్రాల నుంచి ఎగువ సభల పునరుద్ధరణ తీర్మానాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇవేవీ కదలడం లేదన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా ఎగువ సభలపై ఒక విధానం తీసుకురావాలని సీరియ్‌స్ గా ఆలోచిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ లో మండలి రద్దును ఒక ప్రత్యేక కేసుగా పరిగణించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని పార్లమెంట్ లో చర్చకి తీసుకువస్తే తప్ప ఈ తీర్మానం పార్లమెంటు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు అని అన్నారు.


Tags:    

Similar News