వైఎస్సార్ మాస్ లీడర్... కీర్తించిందెవరో తెలుసా?

Update: 2019-09-03 12:57 GMT
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పదో వర్థంతి సందర్భంగా నిన్న ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే... వైఎస్ అన్నా - వైఎస్ తనయుడు - వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నా ఎంతమాత్రం గిట్టనట్టే వ్యవహరించే టీడీపీకి చెందిన కీలక నేత... వైఎస్ కు నివాళి అర్పిస్తూ తనదైన శైలిలో వైఎస్ పై ప్రసంశల వర్షం కురిపించారు. వైఎస్ కు నివాళి అర్పించిన సదరు టీడీపీ మరెవరో కాదు... అందరూ ఎర్రన్నగా పిలుచుకునే కింజరాపు ఎర్రన్నాయుడు కుమారుడు - ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా కొనసాగుతున్న కింజరాపు రామ్మోహన్ నాయుడే.

ట్విట్టర్ వేదికగా వైఎస్ వర్థంతిని గుర్తు చేస్తూ రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ ను మాస్ లీడర్ గా అభివర్ణించిన రామ్మోహన్ నాయుడు... లక్షలాది మందిని తన పాలనతో - తన విధానాలతో ప్రభావితం చేసిన నేతగా అభివర్ణించారు. వైఎస్ మాస్ లీడర్ అని - ఆయన ఎందరినో ప్రభావితం చేశారన్న విషయాల్లో ఏ ఒక్కరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కూడా రామ్మోహన్ నాయుడు... వైఎస్ ను ఆకాశానికెత్తేశారు. అంతేకాకుండా తెలుగు నేలతో పాటు ఏకంగా దక్షిణ భారతంలోనూ వైఎస్ కారణంగా ప్రభావితం అయిన వారెందరో ఉన్నారని కూడా రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కు నివాళి అర్పించిన ఏ ఒక్క వైసీపీ - కాంగ్రెస్ నేత చేయనంత మేర వైఎస్ ఆకాశానికెత్తేస్తూ రామ్మోహన్ ఈ వ్యాఖ్యలు చేయడం నిజంగానే ఆశ్చర్యం కలిగించేదే.

సరే వైఎస్ ను ఆకాశానికి ఎత్తేసిన రామ్మోహన్.. వైఎస్ కుమారుడిగా ఉన్న వైసీపీ అధినేతను మాత్రం తనదైన శైలిలో తెగిడేశారని కూడా చెప్పాలి. తెలుగు నేలతో పాటు దక్షిణ భారంతో ఎందరినో ప్రభావితం చేసిన వైఎస్... ఓ సంక్లిష్టమైన వ్యక్తిని, సంక్లిష్టమైన పాలనను వదిలి వెళ్లారంటూ జగన్ పై రామ్మోహన్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని రామ్మోహన్... వైఎస్ వర్థంతిన వైఎస్ ను ఆకాశానికి ఎత్తేస్తూ... ఆయన కుమారుడు జగన్ ను తెగడుతూ చేసిన ట్వీట్ ను జగన్ స్వయంగా చూసేలా... తన ట్వీట్ ను జగన్ ట్విట్టర్ అకౌంట్ కు జత చేశారు. మొత్తంగా ఓ నేత వర్ధంతి నాడు సదరు నేతను ఓ వైపు ఆకాశానికెత్తేస్తూనే... మరోవైపు ఆయన కుమారుడిని తెగడుతూ రామ్మోహన్ స్పందించిన తీరు నిజంగానే ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి. అంతేకాకుండా ఈ తరహాలో వైఎస్ కు నివాళి అర్పించిన రామ్మోహన్ కొత్త రకంగా నివాళి అర్పించారన్న వాదన వినిపిస్తోంది.




Tags:    

Similar News