15 సీట్లిచ్చిన పశ్చిమలో టీడీపీ జెండా చిరగబోతుందా?

Update: 2019-01-05 17:00 GMT
ఏపీ పాలిటిక్సుకు ఇండికేటర్ లాంటి జిల్లా పశ్చిమగోదావరి. అక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకునే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. గత ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో టీడీపీ - దాని మిత్రపక్ష నేతలనే గెలిపించిన ఈ జిల్లా ఈసారి ఏ పార్టీని గెలిపిస్తుందన్నది అంతటా ఆసక్తి కలిగిస్తోంది. ఈసారి అక్కడ మూడో రాజకీయ పార్టీ కూడా ప్రభావవంతం గానే ఉండడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అంతేకాదు.. పశ్చిమలో వీచే గాలి ఈసారి రాష్ట్రమంతా వీచకపోవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. అదేసమయంలో టీడీపీలో గ్రూపుల గొడవల కారణంగా ఆ పార్టీ ఈసారి ఇక్కడ దారుణంగా దెబ్బతినబోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
 
2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ మద్దతుతో నరసాపురం లోక్‌ సభ - తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. ఈసారి ఆ సీట్లలో కూడా టీడీపీనే పోటీ చేయనుంది. ఎంపీ సీట్లు రెంటిలోనూ రెండు పార్టీల తరఫునా కొత్త ముఖాలు రంగంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లలో ఈ రెండు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులపై కొంత స్పష్టత కనిపిస్తోంది. ఏలూరు అసెంబ్లీ సీటుకు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మళ్లీ పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతర్గత సమస్యలు మాత్రం ఆయన్ను వెన్నాడుతున్నాయి. వైసీపీ అభ్యర్థిత్వం పార్టీ జిల్లా అధ్యక్షుడు - ఎమ్మెల్సీ ఆళ్ల నానికి దక్కే సూచనలున్నాయి. దెందులూరులో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మళ్లీ పోటీ చేయనున్నారు. ప్రభాకర్‌ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నా నియోజకవర్గంపై గట్టి పట్టున్న నాయకుడు కావడంతో అధినాయకత్వం కూడా మరో ఆలోచన చేయడం లేదు. వైసీపీ తరఫున కొఠారు అబ్బయ్య చౌదరిని రంగంలోకి దించనున్నట్లు సమాచారం.
 
ఉంగుటూరులో టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులే మళ్లీ బరిలోకి దిగుతారని తెలుస్తోంది. చింతలపూడిలో పోలవరం (ఎస్టీ)లో టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావుతో ఒక వర్గం విభేదిస్తోంది. కొన్ని ఆరోపణలు కూడా ఆయన్ను చుట్టుముట్టాయి. ఆయనకు ఇవ్వకపోతే తమకు అవకాశం ఇవ్వాలని బొరగం శ్రీనివాస్‌ - కుంజా సుభాషిణి  కోరుతున్నారు. ఇక్కడ వైసీపీ టికెట్‌ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకే దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
  
నరసాపురం లోక్‌ సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమీకరణలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ ఆచంటలో తిరిగి పోటీ చేయనున్నారు. నరసాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మరోసారి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరినా అసెంబ్లీకి ఆయన పేరును పరిశీలించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. నరసాపురం లోక్‌ సభ స్థానానికి ఏ కారణం వల్లనైనా రఘురామ కృష్ణంరాజు పేరు వెనక్కి వెళ్తే సుబ్బారాయుడిని నిలిపే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తిరిగి పోటీ చేయనున్నారు. పాలకొల్లులో సిటింగ్‌ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనకు టీడీపీలో పెద్దగా పోటీ కూడా లేదు.  భీమవరంపై కొంత ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే రాజ్యసభ ఎంపీ సీతారామలక్ష్మి తనయుడు జగదీశ్‌ కు అవకాశం రావచ్చని అంటున్నారు.  ఉండిలో ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మరోసారి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.  తణుకులో టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ మళ్లీ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
 
తాడేపల్లిగూడెంలో టీడీపీ టికెట్‌ కోసం త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యేగా బీజేపీకి చెందిన మాజీ మంత్రి మాణిక్యాలరావు ఉన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జిగా ఉన్న ఈలి నాని తనకే టికెట్‌ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నా.. ఆయనకు మునిసిపల్‌ చైౖర్మన్‌ బోలిశెట్టి శ్రీనివాస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. జడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు కూడా బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు టికెట్‌ వస్తుందని అంటున్నారు. వలవల బాబ్జీ కూడా పోటీదారుగా ఉన్నారు.
 
నిడదవోలు - కొవ్వూరు (ఎస్సీ) - గోపాలపురం అసెంబ్లీ స్థానాలు రాజమండ్రి లోక్‌ సభ స్థానం పరిధిలో ఉన్నాయి. నిడదవోలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు ఈసారి త్యాగం తప్పకపోవచ్చంటున్నారు. ఆయన స్థానంలో కీలక నేత ఒకరు బరిలో దిగే అవకాశాలున్నాయి. కొవ్వూరు(ఎస్సీ)లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కేఎస్‌ జవహర్‌ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు టీడీపీ వర్గాల మధ్య నెలకొన్న వైరం ఆయన తలకు చుట్టుకొంది. ఆయన తటస్థంగా ఉండకుండా ఓ వర్గం వైపు ఉంటున్నారన్న విమర్శ ఎదుర్కొంటున్నారు. ఈ గొడవల నేపథ్యంలో ఆయన ఈసారి కృష్ణా జిల్లా తిరువూరు (ఎస్సీ) వెళ్లిపోతారని ప్రచారం మొదలైంది. ఆయన మాత్రం ఖండిస్తున్నారు.  గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యేగా ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇతర రిజర్వుడు నియోజకవర్గాల మాదిరిగా ఇక్కడ గొడవలు లేవు. కానీ ఆయన నియోజకవర్గంపై పట్టు సాధించలేదన్న అభిప్రాయంలో కొందరు నేతలు ఉన్నారు.
 
ఏలూరు సిట్టింగ్‌ టీడీపీ ఎంపీ మాగంటి బాబు ఈసారి ఎంపీగా పోటీ చేస్తారా అన్నది అనుమానంగా కనిపిస్తోంది. ఎంపీ పోటీ ఆర్థికంగా తలకు మించిన భారం కావడం, కొన్ని నియోజకవర్గాల్లో వర్గాల సమస్యలు ఎదురు కావడంతో ఆయన కొంత నిరాసక్తత కనబరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎంపీగా పోటీ చేయకపోతే ఆయన కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే లోక్‌సభ సీటు యువ నేత బోళ్ల రాజీవ్‌కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈయన కేంద్ర మాజీ మంత్రి, దివంగత టీడీపీ సీనియర్‌ నేత బోళ్ల బుల్లిరామయ్య మనవడు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన తోట చంద్రశేఖర్‌ ఆ పార్టీకి దూరమై ఇటీవల జనసేనలో చేరారు. దీంతో వైసీపీ నుంచి మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు పోటీ చేయడం ఖాయమేనని చెబుతున్నారు.
 
మొత్తానికి పార్లమెంటు నియోజకవర్గాల విషయంలో పెద్దగా ఢోకా లేనప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం దాదాపుగా అన్ని చోట్లా టీడీపీలో వర్గ విభేదాలు తీవ్రంగా ఉండడంతో ఈసారి ముక్కోణపు పోటీలో టీడీపీ దెబ్బతినడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.


Full View

Tags:    

Similar News