క‌ళా ఆవేద‌న అంతాఇంతా కాదుగా!

Update: 2019-05-06 05:49 GMT
ఎన్నిక‌ల సంఘాన్ని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏ స్థాయిలో విరుచుకుప‌డుతున్నారో తెలిసిందే.  ఈసీ తీరు ఏ మాత్రం బాగోలేద‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు. ఈవీఎంల మీద త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ.. ఢిల్లీకి వెళ్లి ర‌చ్చ చేసినా.. ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది. విచిత్ర‌మైన అంశం ఏమంటే.. బాబు ఈ స్థాయిలో  ఫైర్ అవుతున్నా.. పార్టీ నేత‌లు ఎవ‌రూ ఆయ‌న వాద‌న‌ను స‌మ‌ర్థిస్తూ మాట్లాడింది లేదు.

ఇన్నాళ్ల‌కు ఆ కొరత తీరుస్తూ.. పార్టీ ఏపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు ఒక లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా ఈసీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల సంఘం ఒక జెండాకు.. ఒక పార్టీకి కొమ్ము కాయ‌టం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. 72 ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో ఈ ఎన్నిక‌ల్లో ఘోర వైఫ‌ల్యాల‌ను ఈసీ మూట‌క‌ట్టుకుంద‌న్నారు.

మోడీ చెప్పు చేతుల్లోని వ్య‌వ‌స్థ‌గా మారి ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తోంద‌న్న ఆయ‌న‌.. ఈవీఎంల ప‌ని తీరు భేష్ అన్న‌ప్పుడు వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించ‌టానికి వ‌చ్చిన ఇబ్బందేమిట‌ని సూటిగా ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల సంఘం తీరును త‌ప్పు ప‌డుతూ 66 మంది బ్యూరోక్రాట్లు.. 150 మంది మాజీ ప్ర‌ధాన సైనికాధికారులు రాష్ట్ర‌ప‌తికి లేఖ రాస్తే ఎందుకు స్పందించ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

14 ల‌క్ష‌ల ఓట్లు లెక్కింపున‌కు ఆరు రోజులు ప‌డుతుంద‌ని కోర్టుకు ఈసీ చెప్పింద‌ని.. అది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌న్నారు. 24 గంట‌ల్లో 14 ల‌క్ష‌ల ఓట్లను బండిల్స్ గా క‌ట్టి కౌంటింగ్ చేసిన రోజులు ఈ త‌రానికి తెలీదా? అంటూ ఆస‌క్తిక‌ర అంశాన్ని తెర మీద‌కు తెచ్చారు. ఎన్నిక‌ల కోడ్ పేరుతో పాల‌నా వ్య‌వ‌హారాలు కుంటుప‌డేలా చేయ‌ట‌మే ప్ర‌జాస్వామ్య‌మా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. కోడ్ అన్న‌ది ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనేనా?  కేసీఆర్.. మోడీ స‌మీక్ష‌ల‌కు వ‌ర్తించ‌దా? అని ప్ర‌శ్నించారు. అదే ప‌నిగా మాట్లాడే బాబు మాట‌ల‌తో పోలిస్తే.. ఈసీ మీద క‌ళా చేసిన వ్యాఖ్య‌లు ప‌దునుగా ఉండ‌ట‌మే కాదు.. కాసింత లాజిక్ కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయ‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.
Tags:    

Similar News