టీడీపీ.. కోర్టుకు వెళ్తుందా - లైట్ తీసుకుంటుందా?

Update: 2019-06-22 05:56 GMT
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు భారతీయ జనతా పార్టీలో చేరడాన్ని పార్లమెంట్ అధికారికంగా గుర్తించింది. వారి విలీనం చట్టబద్ధమే అని రాజ్యసభ ఒక ప్రకటన చేసింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ - నాలుగో పేరాను అనుసరించి విలీనం అధికారికమే అని రాజ్యసభ స్పష్టం చేసింది. ఇందులో వాదోపవాదాలకు ఆస్కారం లేదని రాజ్యసభ అంటోంది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ - ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు.

రెండూ బై మూడో వంతు సభ్యుల  తీర్మానం మేరకు విలీన ప్రక్రియను చేపట్టినట్టుగా.. ఈ అంశాన్ని వెంకయ్య నాయుడు చాలా నిశితంగా పరిశీలించారని.. అనంతరమే విలీనాన్ని అధికారికం చేస్తూ నిర్ణయం  తీసుకున్నట్టుగా రాజ్యసభ నుంచి ప్రకటన వచ్చింది.  నలుగురు రాజ్యసభ సభ్యులూ బీజేపీ ఎంపీలుగా గుర్తిస్తున్నట్టుగా పేర్కొంది.

ఈ విషయంలో సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు పంపడం కూడా జరిగిపోయిందట. ఇక నుంచి వారిని బీజేపీ ఎంపీలుగానే ట్రీట్ చేయాలని రాజ్యసభ చైర్మన్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ విలీనం చెల్లదని తెలుగుదేశం పార్టీ అంటోంది.  ఈ విషయంలో రాజ్యసభ చైర్మన్ కే టీడీపీ ఎంపీలు కొందరు ఫిర్యాదు చేశారు. అయితే విలీనం అధికారికం అని అదే వ్యక్తి నుంచి ఆదేశాలు రాగా… టీడీపీ ఆయనకే ఫిర్యాదు చేసింది. దీన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్తుందా - లేక లైట్ తీసుకుంటుందో చూడాల్సి ఉందని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News