ఉ అంటే కేసు--పోస్తే కేసే అంటున్న కేసీఆర్‌

Update: 2018-10-03 17:39 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మ‌రోమారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన టీఆర్ ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారు. ఉత్తమ్ పదజాలాన్ని సీఎం తప్పుబట్టారు. గౌరవంగా మాట్లాడితే బాగుంటుందని సూచన చేశారు. నేను మాట్లాడితే ఓ పంచాయితీ ఉన్నది. ముఖ్యమంత్రి గిట్ల మాట్లాడుతారా? అని అంటరు. పీసీసీ ప్రెసిడెంట్ పట్టుకొని ఓ మాట అన్నాడు. ముఖ్యమంత్రి బట్టెవాజ్ అన్నాడు. సీఎంను ఆ మాట అనొచ్చా. బట్టెవాజ్ ఎవరు. ఓటు ద్వారా బట్టెవాజ్ ఎవరో చెప్పాలి. ఎవరి ప్రవర్తన ఏదో మీ కండ్ల ముందు ఉంది. నాది కూడా చెడ్డ నోరు. తెరిచిన అనుకో తెల్లారిన దాకా తిడుతా. తప్పని పరిస్థితుల్లోనే ఇట్ల మాట్లాడుతున్న తప్ప వాళ్లతో నాకు పంచాయితీ లేదు. గౌరవప్రదమైన హోదాలో ఉన్న కాబట్టి వాళ్లలా మాట్లాడలేను. చిల్లర గాళ్లతో పంచాయితీ నాకు లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేతల బతుకే కేసులు.. ఊ అంటే కేసు.. ఉ.. పోస్తే కేసులు వేస్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ``రైతుబంధు పథకం కింద నవంబర్ నెలలో యాసంగి పంటకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఇస్తామని చెప్పాం. దీనిపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేసు వేశారు. వాళ్ల బతుకే కేసు. ఊ అంటే కేసు.. ఉ..పోస్తే కేసు. సొల్లు పురాణం చేస్తారు కాంగ్రెసోళ్లు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరెగి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోదామని చెప్పాను. ప్రజల వద్దకు వెళ్దామని చెప్పిన వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయంగానే గిలగిల కొట్టుకుంటున్నారు. సుప్రీం కోర్టు - ఎలక్షన్ కమిషన్ వద్దకు పోయి అడ్డుకుంటున్నారు. ఎన్నికలకు పోదామా? అని ప్రశ్నించిన వారే.. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు`` అని ఆరోపించారు.

పదవులంటే ఎడమకాలి చెప్పుల్లా విసిరేశామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ``రాష్ట్రం స్థిరత్వంగా ఉండాలనే రద్దు చేశాం. కడుపు కట్టుకొని - నోరు కట్టుకొని అవినీతికి దూరంగా ఉండి పని చేసిన కారణంగా రాష్ట్ర ఆదాయం ఇండియాలోనే నెంబర్ వన్‌గా ఉంది. నాలుగేళ్లలో 17.17 శాతం ఆర్థిక ప్రగతి ఉంది. గడిచిన నాలుగైదు నెలల్లో 19.83 శాతం ఆర్థిక ప్రగతి ఉందన్నారు. ఈ ప్రగతి ఎట్ట సాధ్యమైంది. అవినీతి లేకుండా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. ఇసుక మీద ప్రభుత్వానికా ఆదాయం వస్తుంది. 10 సంవత్సరాలు.. కాంగ్రెస్ పరిపాలనలో 10 జిల్లాల్లో ఇసుక మీద వచ్చినటువంటి ఆదాయం తొమ్మిదిన్నర కోట్లు. ఈ నాలుగేండ్లలో ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ.1977 కోట్లు`` అని కేసీఆర్ చెప్పారు.

తాజా మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ``బీజేపీ ఆయన ఒకటి చెప్పిండు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఇండ్ల కిరాయిలు కడుతాడంటా. ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ స్కీమ్. ఎన్నికల ముందు నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారు. అధికారంలో ఉన్న నాడు ఏం చేయలేదు. మోడీ - అమిత్ షా గత ఎన్నికల ప్రచార సభల్లో విదేశాల నుంచి నల్లధనం తీసుకువస్తామన్నారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పలేదా? ఆ హామీ ప్రకారం.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తే మేమే ఇళ్ల కిరాయిలు కడుతాం. ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారా? అమాయకులు అనుకుంటున్నారా? ప్రజలెవరూ మోసాలకు గురికావొద్దని మనవి చేస్తున్నా. చెప్పేటోడు చెవిటోడు అయినా.. వినేతోడికి ఇజ్జత్ ఉండాలి కాదా?`` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News