తెలంగాణ.. ఆంధ్రా ప్రజల మధ్య విద్వేషాలా? మీకెవరు చెప్పారు మోడీ?

Update: 2022-02-09 07:30 GMT
ఏపీ రాష్ట్ర విభజన గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు తీరులో విభజన చేసిందన్న మాటతో పాటు.. పార్లమెంటు తలుపులు మూసి.. టీవీల్లో సమావేశాల ప్రసారాన్ని బంద్ చేసి.. మైకులు కట్ చేసి.. విభజన బిల్లును ఆమోదించిందన్న మాట వరకు ఓకే. ఎందుకంటే.. అది చరిత్రలో నమోదైంది. దాన్ని ఎవరూ కాదనలేరు.

అయితే.. ఆ పేరు చెప్పి.. ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు ఉన్నట్లుగా ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చిన మాటల్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఇందులో అవగింజంత అయినా నిజం ఉంటే ఓకే. కానీ.. అలాంటిదేమీ లేనప్పుడు అలాంటి అభిప్రాయాల్ని.. భావనల్ని మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాష్ట్ర విభజన వేళ.. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య కాసిన్ని సందేహాలు.. సంశయాలు ఉన్నాయి. కానీ.. అవన్నీ చాలా త్వరగా సమిసిపోవటమే కాదు.. ఇప్పుడు ఏవి పాలు.. ఏవి నీళ్లు అన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమైపోతున్న పరిస్థితి. ఆ మాటకు వస్తే.. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాలకు చెందిన వారి మధ్య పెళ్లిళ్ల జోరు అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి. ప్రధాని మోడీ చెప్పినట్లుగా తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య విద్వేషాలు ఉండి ఉంటే.. పెళ్లిళ్లు జరగవు కదా?

ఆ మాటకు వస్తే తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రోళ్లను తెలంగాణవాసులు చిన్నబుచ్చుతున్నది లేదు. ఆ మాటకు వస్తే.. పాలునీళ్లలా కలిసిపోయిన పరిస్థితి. ఆంధ్రా వ్యతిరేకతను వినిపించే టీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన సెటిల్ అయిన వారు మద్దతు ఇస్తున్న వైనాన్ని మర్చిపోకూడదు. మొన్నటికి మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గౌరవనీయ స్థానాల్ని సొంతం చేసుకున్నదంటే.. దానికి కారణం ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లు గులాబీ పార్టీ పక్షాన నిలవటం.

సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన ఎలాంటి పంచాయితీ లేదు. ఆ మాటకు వస్తే.. రాజకీయంగా విభేదాలు ఉన్నాయే తప్పించి.. ప్రజల మధ్య ఎలాంటి ద్వేష భావం లేదు. మరి.. లేని ద్వేషాన్ని ఉందంటూ రాజ్యసభ సాక్షిగా దేశ ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ ఎలా చెబుతారు? ఆయనకు అలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నదెవరు? రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య  విద్వేషాలు ఉన్నాయని.. అవి రెండు రాష్ట్రాలకు నష్టం కలిగిస్తున్నాయన్న విషయాన్ని మోడీకి ఎవరు చెప్పారు? అన్నది ప్రశ్న.

దీనికి ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ మాటకు వస్తే.. మోడీకి విద్వేష ఫీడ్ బ్యాక్ ఇస్తున్న వారిని చెప్పుతో కొట్టాల్సిందే. ఎందుకంటే.. ప్రజల మధ్య లేని విద్వేష భావాల్ని ప్రధాని నోటి నుంచి పలికించిన వారికి ఆ మాత్రం శిక్ష విధించాల్సిందే. వెనుకా ముందు చూసుకోకుండా.. ఈ తరహా వ్యాఖ్యల్ని చేసే మోడీ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News