టాలీవుడ్ టాక్: బీజేపీ చక్రం తిప్పునా.. ?
అంతేకాదు.. అసలు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుందని కూడా అంచనా వేసుకోలేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమా రంగంలో కలకలం రేగింది. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో విడుదల సందర్భంగా.. చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన.. రేవతి అనే మహిళ మృతి.. ఆమె కుమారు డు ఆసుపత్రిపాలు కావడం వంటివి ఆందోళన సృషించాయి. అయితే.. వీటిని మించి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. రాజకీయంగా.. టాలీవుడ్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. నిజానికి ఇంత ఇబ్బంది అవుతుందని.. ఏ ఆర్టిస్టూ ఊహించలేదు.
అంతేకాదు.. అసలు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుందని కూడా అంచనా వేసుకోలేదు. ఫలితం గానే టాలీవుడ్ ఇప్పుడు ఇరకాటంలో పడింది. ఒకప్పుడు.. జగన్ ప్రభుత్వం ఏపీలో సినీమా రంగంపై ఉక్కు పాదం మోపిందన్న ప్రచారం జరిగింది. టికెట్ల ధరలు పెంచడంతోపాటు.. ప్రీమియర్ షోలపైనా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇక, అప్పట్లో మెగా స్టార్ చిరు జోక్యం చేసుకుని.. పరిస్థితిని కొంత వరకు సర్దుమణిగేలా చేశారు.
ఇక, ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి వచ్చేసింది. పుష్ప-2 ఎఫెక్ట్ సినీరంగంపై పడింది. ఇలాంటి సమయంలో ఎవరు ముందుకు వచ్చి.. చక్రం తిప్పుతారనేది కీలకంగా మారింది. ఒకప్పుడు చిరు ఏపీలో చక్కదిద్దారు. కానీ, ఇప్పుడు ఆయనకు స్కోప్ తక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. నేరుగా సీఎం రేవంత్ ను కలిసే అవకాశం తక్కువేనని.. చెబుతున్నారు. ఈ క్రమంలో పరోక్షంగా బీజేపీ ద్వారా కథ నడిపించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
నిజానికి బీజేపీ-కాంగ్రెస్ ఉప్పు-నిప్పు అన్న సంగతి తెలిసిందే. అయితే.. కేంద్రంలోని కొందరు పెద్దల ద్వారా.. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో సరిపుచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలోనూ కొందరు కాంగ్రెస్ పార్టీనాయకులు ఉండడం.. వారు కూడా.. సినీ రంగంతో బంధం పెనవేసుకున్న నేపథ్యంలో బీజేపీ ద్వారానే కాగల కార్యం చక్కపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. అయితే.. అది నేరుగానా..? పరోక్షంగానా? అన్నది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితిలో కమల నాథులు జోక్యం చేసుకుంటేనే పరిస్థితి చక్కబడే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్ ..!