ఏపీలో తెలంగాణ ఉద్యోగులకు అవమానమా?

Update: 2017-01-06 05:13 GMT
కాస్త ఓపెన్ గా మాట్లాడుకుంటే.. చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఒక్కటిగా ఉన్న తెలుగు ప్రజల మధ్య చీలిక ఎందుకు వచ్చింది?రెండు రాష్ట్రాలుగా ఎందుకు విడిపోయింది? లాంటి ప్రశ్నలు వేసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం..అవమానం.. కేటాయింపుల్లో పక్షపాతం లాంటి మాటలు చాలానే వినిపిస్తాయి. తెలంగాణరాష్ట్రం రావటం ఆలస్యం వేలాది ఉద్యోగాలు వెల్లువలా వచ్చి పడతాయని.. తెలంగాణలోని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం పక్కా అన్న చాలానే మాటల్ని ఉద్యమ పార్టీగా వ్యవహరించిన టీఆర్ ఎస్ ప్రచారం చేసింది. అందులో ఎంతవరకు నిజమన్నది గడిచిన రెండున్నరేళ్ల టీఆర్ ఎస్ పాలనలో అందరికి అర్థమైంది. రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని విద్యార్థులకు వచ్చే ఉద్యోగాల సంఖ్యను చెప్పినప్పుడు పలువురు విస్మయాన్ని వ్యక్తం చేశారు.

ఉద్యమనేతగా ఉన్నప్పుడు చెప్పిన ఊరింపు మాటలకు.. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చెప్పిన మాటలకు మధ్యనున్న వ్యత్యాసం అందరికి అర్థమవుతూనే ఉంది. ఈ హామీల్ని పక్కన పెడితే.. ఉద్యమ సమయంలోనూ ఆంధ్రాలోని తెలంగాణ ప్రజలు తీవ్ర అవమానానికి గురి అయినట్లుగా ఆరోపణలు వచ్చేవి. నాటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా అప్పటి ఆంధ్రా నేతలు ఎవరూ నోరు ఎత్తేవారు కాదు. ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పల్లెత్తు మాట కూడా బయటకు వచ్చేది కాదు. దీంతో.. హైదరాబాద్ మహానగరం లాంటి చోట ఆంధ్రావారికి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడే నాథుడే లేకుండా పోయారని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తాజాగా కూడా ఏపీలోని తెలంగాణ వారు తీవ్రమైన అవమానాలకు గురి అవుతున్నట్లుగా తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగటాన్ని మర్చిపోకూడదు. ఆంధ్రాలో ఉన్న నాలుగో తరగతి తెలంగాణ ఉద్యోగులకు ఎదురవుతున్న అవమానాలు ఏంటి? హైదరాబాద్ లోనూ.. మిగిలిన తెలంగాణలో ఉన్న ఆంధ్రులకు అవమానాలేవీ ఎదురుకావటం లేదా? అన్నది ప్రశ్న. విడిపోయి కలిసి ఉందామన్న ఉద్యమ మాటకు భిన్నంగా తరచూ ఆంధ్రా వాళ్లను పంపించి వేస్తాం? అని కొందరు.. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఆంధ్రావాళ్లేనా? తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వాలి?లాంటి మాటలు.. తెలంగాణలోని ఆంధ్రావారికి అవమానాన్ని కలిగించేలా ఉండవా? అన్నది ప్రశ్న.

తెలంగాణ అసెంబ్లీలో వచ్చిన ప్రస్తావనకు తగ్గట్లు ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులకు నిజంగానే అవమానాలకు గురి అవుతుంటే.. ఏపీ సర్కారు వెనువెంటనే స్పందించాల్సి ఉంది. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది. ఒకవేళ అలాంటివేమీ లేకుంటే వెంటనే ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ.. ఏముందిలే అన్న నిర్లక్ష్యం.. విభజన వరకూ తీసుకొచ్చిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ అసెంబ్లీలో వచ్చిన చర్చపై ఆంధ్రా ప్రభుత్వం వెనువెంటనే స్పందించటంతో పాటు.. తెలంగాణలో ఆంధ్రా వారు ఎదుర్కొంటున్న సమస్యలు.. అవమానాలపై ఏపీ నేతలు మాట్లాడాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఆ పని ఏపీ అధికారపక్షం చేస్తుందా? అన్నదే ప్రశ్న. ఎప్పటిలానే నిలువెత్తు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే.. ఆంధ్రోళ్లు మరిన్ని మాటలు పడేందుకు సిద్ధంగా ఉండాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News