మోదీ కుదర్దన్నా.. అయినా కేసీఆర్ ముందుకు

Update: 2020-02-17 13:00 GMT
దేశవ్యాప్తంగా పౌర సవరణ చట్టం, ఎన్నార్సీ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని షాహిన్ బాగ్ లో రెండు నెలలుగా నిరాటంకం గా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ అమలు చేయవద్దని కోరుతూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తంగా జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, మహారాష్ట్రతో తెలంగాణ లోనూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అయితే ఎన్ని ఆందోళనలు జరిగినా తాను వెనకడుగు వేసేది లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం స్పష్టం చేశారు. వారణాసి లో జరిగిన సభ లో ప్రకటించగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అదే రోజు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. మంత్రిమండలిలో తీర్మానం చేసి త్వరలోనే అసెంబ్లీ లో వాటికి వ్యతిరేకం గా తీర్మానం చేస్తామని ప్రకటించారు.

తెలంగాణ మంత్రిమండలి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం సమావేశమైంది. దాదాపు ఐదారు గంటల వరకు జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే అందులో ముఖ్యంగా ఈ సీఏఏకు వ్యతిరేకంగా మంత్రిమండలి తీర్మానం ఆమోదం తెలపడమే విశేషం. కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్, రాజస్థాన్ మాదిరి తాము కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి వాటిని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ప్రకటించారు.

భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మత  పరమైన వివక్ష చూపరాదని తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని, భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు త్వరలోనే జరిగే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Tags:    

Similar News