హైదరాబాద్ ఐపీఎస్ కు ఐఏఎస్ పోస్టింగు

Update: 2016-07-25 07:36 GMT
అఖిల భారత సర్వీసులైన ఐపీఎస్ - ఐఏఎస్ లు ఎవరు ఏ బాధ్యతలు చేపట్టాలన్న స్పష్టమైన వర్గీకరణ ఉంది.  ఐఏఎస్ ల బాధ్యతలు - ఐపీఎస్ లు కానీ.. ఐపీఎస్ ల బాధ్యతలు ఐఏఎస్ లు కానీ చేపట్టడం తక్కువ. అయితే... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓ ఐపీఎస్ అధికారికి ఐఏఎస్ బాధ్యతలు అప్పగిస్తున్నారు.  ఐపీఎస్ అధికారిగా మంచి పేరున్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఐఏఎస్ అధికారులు నిర్వర్తించే గురుకుల పాఠశాలల కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.  ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించగా అనంతరం రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ కేడర్ కు వచ్చిన ఆయనను కేసీఆర్ సర్కారు అదే పోస్టులో కొనసాగిస్తోంది. తాజాగా తెలంగాణలో మరో ఐపీఎస్ కు కూడా ఐఏఎస్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో పోలీస్ శాఖలో పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన్ను పౌరసరఫరాల శాఖ కమిషనర్ ను చేస్తారని తెలుస్తోంది.

హైదరాబాదు పోలీసు శాఖలో పలు కీలక పదవుల్లో పనిచేసిన సదరు అధికారికి ఈ కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ సర్కారు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విధి నిర్వహణలో అలసత్వం - అవినీతికి ఆమడ దూరంలో ఉంటారని భావిస్తున్న సదరు అధికారికి... పౌర సరఫరాల్లో కొనసాగుతున్న అవినీతి దందాను అరికట్టే బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ప్రజా పంపణీ వ్యవస్థలో కీలకమైన సివిల్ సప్లైస్ కమిషనర్ పదవిలో సదరు అధికారిని నియమిస్తే ఆ శాఖలోని మకిలిని కడిగిపారేస్తారన్న భావనతోనే ప్రభుత్వం ఈ దిశగా యోచించేందుకు కారణంగా నిలిచినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆ ఐపీఎస్ ఎవరా అన్న చర్చ జరుగుతోంది. సీవీ ఆంనద్ కు ఆ అవకాశం ఇస్తారని వినిపిస్తుండగా నిజాయితీ గల అధికారిగా పేరున్న రాజీవ్ రతన్ పేరు కూడా వినిపిస్తోంది.
Tags:    

Similar News