హైద‌రాబాద్‌ లో మ‌ల్టీ లెవ‌ల్ ఫ్లై ఓవ‌ర్లు

Update: 2015-07-24 16:28 GMT
హైద‌రాబాద్‌ ను డ‌ల్లాస్ లాగా మారుస్తాన‌ని చెప్పిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆ క్ర‌మంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. భాగ్య‌న‌గ‌రంలో మొద‌టి ద‌శ‌లో 20 చోట్ల మ‌ల్టీలెవ‌ల్ ఫ్లై ఓవ‌ర్లు, జంక్ష‌న్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున అనుమ‌తులు మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందుకోసం రూ.2630 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఈపీసీ టెండ‌ర్ల విధానంలో ఈ ప్లై ఓవ‌ర్ల నిర్మాణం పూర్తి చేయాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

రెండున్నర ఏళ్ల‌లో నిర్మాణం పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న ఈ మ‌ల్టీ లెవ‌ల్ ఫ్లై ఓవ‌ర్లను పీపీపీ ప‌ద్ద‌తిలో నిర్మించ‌నున్నారు. 20 వాయిదాల్లో ఈ మొత్తాల‌ను సంబంధిత నిర్మాణ కంపెనీల‌కు జీహెచ్ఎంసీ చెల్లిస్తుంది. జీహెచ్ఎంసీ విష‌యంలో కంపెనీలు భ‌రోసాగా ఉంటాయా లేదా అనే సందేహాల‌కు తెర‌దించేలా, త‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న ప‌రిస్థితుల్లో నిర్మాణ‌ సొమ్ముకు ప్ర‌భుత్వం గ్యారంటీగా ఉండ‌నుంది.

హైద‌రాబాద్ న‌గరంలో అనేక చోట్ల రోడ్లు బాగాలేని ప‌రిస్థితుల్లో, కిక్కిరిసిపోతున్న ట్రాఫిక్ స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించ‌కుండా మ‌ల్టీ లెవ‌ల్ ఫ్లై ఓవ‌ర్ల నిర్ణ‌యంతో స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుందా అనే సందేహాం ప‌లువ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మవుతోంది. ఇప్ప‌టికే మెట్రో నిర్మాణంతో అనేక చోట్ల ట్రాఫిక్ చిక్కులు ఎదుర‌వుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం ఏ మేర‌కు ప్ర‌భావం చూపుతుందో మ‌రి.
Tags:    

Similar News