మోదీ..కెసీఆర్ భేటీ....ఆయనకు గుబులు

Update: 2018-08-04 16:30 GMT
శనివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు భేటీ ఒకరికి చిరాకు తెప్పించింది. అదెవరో తెలుసుకుందుకు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. వీరిద్దరి కలయిక వల్ల ఎవరికి తీవ్రంగా నష్టం జరుగుతుందో వారి గుండెల్లోనే ఈ గుబులు ప్రారంభమైంది. ఎవరా అని ఆలోచిస్తున్నారా... ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. తెలంగాణలో జోనల్ వ్యవస్ధతో పాటు ఇతర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఏకంగా 11 వినతి ప్రతాలను ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చారట.వారిద్దరు దాదాపు గంట పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. లోపల ఏం జరిగిందో వారిద్దరిలో ఏ ఒక్కరో చెప్పాల్సి ఉంది. అయితే వారిద్దరు అసలు విషయాన్ని దాచి కొసర విషయాలనే మీడియాకు వెల్లడిస్తారు. అయితే  వీరిద్దరి సంయుక్త వ్యూహంలో భాగంగా కొన్ని కీలక అంశాలను మాత్రం తమ విలేకరులు కొందరి చెవిలో ఊదుతారు. అలా ఊదిన కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చేర వేయడం కూడా జరిగిపోయిందని మీడియా వర్గాల్లో శనివారం సాయంత్రం నుంచి ప్రచారం ప్రారంభమైంది.

తెలంగాణ ముఖ్యమంత్రికి తనకు ఇవ్వాల్సిన నిధులు... తాను చేయాల్సి విధుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించడం కేవలం 20 నిమిషాలలోనే జరిగిపోయిందట. అయితే మిగిలిన సమయంలో ఎక్కువ భాగం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పరిస్ధితుల గురించి వారిద్దరు చర్చించుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో తనకున్న పాత స్నేహితులు, తన కుమారుడు, మంత్రి తారక రామారావుకున్న ఉన్న పరిచయాలతో అక్కడి పరిస్థితులు ఏమిటో తనకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రధానికి వివరించినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మకం పోయిందని కెసీఆర్ వివరించినట్లు చెబుతున్నారు. అలాగే ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర, దానికి వస్తున్న ప్రజాదరణ కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. రానున్న శాసనసభ ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయమని, ఆయన పాదయాత్రకు వస్తున్న జనంలో ఆయనపై నమ్మకం కనిపిస్తోందని ముఖ‌్యమంత్రి కె.చంద్రశేఖర రావు వివరించినట్లు చెబుతున్నారు. మొత్తానికి ప్రధాని, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిలో గుబులు రేగుతూండడం కొసమెరుపు.
Tags:    

Similar News