రంగంలోకి దిగిన కేసీఆర్ 'సైన్యం'

Update: 2016-08-26 07:32 GMT
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి పెద్దఎత్తున విమర్శలు.. ఆరోపణలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీపైనా.. ఆ పార్టీ నేతల మీద నోరు విప్పకుండా గమ్మున ఉన్న తెలంగాణ అధికారపక్షం నేతలు.. తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర సర్కారుతో మహా ఒప్పందం చేసుకొని వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేంజ్ లో చెలరేగిపోయారో తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ నేతలపైన నిప్పులు చెరిగిన సీఎం.. తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెడతానని హెచ్చరించటం తెలిసిందే.

కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగటం.. ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్న వారిని మాటలతో చీల్చిచెండాడుతున్న నేపథ్యంలో కేసీఆర్ సైన్యం రంగంలోకి దిగింది. తమ అధినేత మీద ఈగ వాలినా ఊరుకోని టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్లు ప్రాజెక్టుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై ఎవరూ స్పందించొద్దన్న అధినేత సూచనకు ఇప్పటివరకూ ఓపిగ్గా ఎదురుచూసి తాజాగా చెలరేగిపోతున్నారు.

తన మాటలతో సెగలు పుట్టించే టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ రంగంలోకి వచ్చేశారు. ప్రాజెక్టుల అంచనాలు రాత్రికి రాత్రే భారీగా పెంచేసి కోట్లాది రూపాయిల్ని దోచుకుతినే తత్వం కాంగ్రెస్ నేతలదని మండిపడ్డ ఆయన.. మహారాష్ట్రతో జరిగిన ఒప్పంద పత్రాల్ని చూపించమంటే కాంగ్రెస్ నేతలు చూపించకుండా కుక్కల్లా మెరుగుతున్నారంటూ చెలరేగిపోయారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి బహిరంగంగా సవాలు విసిరారని.. దమ్ముంటే ఆ సవాల్ ను స్వీకరించాలంటూ ఉత్తమ్ కు ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి మీద తప్పుడు కూతలు కూస్తున్న కాంగ్రెస్ నేతలు తమ నోటిని అదుపులో ఉంచుకోవాలని. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాల్క సుమన్ లాంటి ఫైర్ బ్రాండ్స్ మీద తెలంగాణ కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News