ఏడేళ్లకు బొజ్జా తారకం గొప్పతనం గుర్తుకొచ్చిందా కేసీఆర్?

Update: 2021-08-18 13:30 GMT
మంచిగా నానపెట్టి.. సిద్ధం చేసిన గోధుమ పిండి చేతిలో ఉండాలే కానీ.. అయితే చపాతి.. లేదంటే.. పరోటా.. కాదంటే పూరీ ఏదైనా క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. కాకుంటే కావాల్సిందల్లా సిద్ధం చేసిన గోధుమ పిండి ముద్దనే. మాటలు నేర్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసినప్పుడుఈ పోలిక ఇట్టే గుర్తుకు రాక మానదు. తన అవసరానికి తగ్గట్లు తెలివిగా వాడేయటంలో గులాబీ బాస్ తర్వాత. అప్పుడెప్పుడో సామాజిక సమీకరణాలు.. లెక్కల్లో భాగంగా ప్రజా కమి కమ్ గాయకుడు గోరేటి వెంకన్నను ఎమ్మెల్సీని చేయటం.. ఆ తర్వాత ఆయన ఊసే పట్టకుండాపోవటం తెలిసిందే.

పిలిచి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని గోరేటి వెంకన్న కాస్తంత ఇబ్బందిగానే స్వీకరించారని చెబుతారు. ఎందుకంటే.. తనకున్న ఇమేజ్ కు పదవిని తీసుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని నమ్మే మట్టిమనిషిగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అలా అని.. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని కాదనలేక పదవిని చేపట్టిన ఆయన చేత చేయించాల్సిన పనులు చాలానే ఉన్నాయి. కానీ.. అవేమీ పట్టని కేసీఆర్ ఆయనకు పదవి ఇచ్చి పక్కన పెట్టేశారు. తాజాగా ఆయన మదిలో మెదిలిన దళితబంధు పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని డిసైడ్ అయిన నేపథ్యంలో.. అర్జెంట్ గా మనసును తాకే పాటల్ని సిద్ధం చేయాల్సిన అవసరం కేసీఆర్ కు వచ్చింది.

అంతే.. ఎమ్మెల్సీ పదవిని చేపట్టిన తర్వాత ప్రగతి భవన్ లో కనిపించని గోరేటి వెంకన్నకు ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసానికి తరచూ వెళ్లాల్సి రావటం అలవాటుగా మారింది. అంతేనా.. తన వెంట తిప్పుకుంటున్న ఆయన.. ప్రజలకు గోరేటి వెంకన్నను పరిచయం చేయటం.. ఆయన గొప్పతనాన్ని పల్లె జనాలకు పరిచయం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేసీఆర్ మనసు మొత్తం దళిత బంధు చుట్టూనే తిరుగుతోంది. నిజానికి తెలంగాణ ప్రజలకు ఇదేం కొత్త అనుభవం కాదు.

తాను ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే.. అంతా దాని మీదనే చర్చ జరిగేలా చేయటం కేసీఆర్ కు అలవాటే. రాష్ట్రంలో ఏదైనా అంశాన్ని ఎజెండా చేయాలంటే ఆయనకు మించినోళ్లు ఉండరు. నిజానికి ఇలాంటి పని గతంలో ప్రజా సంఘాలు.. ఉద్యమ నాయకులు.. మీడియాలు చేసేవి. ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ కు ఎప్పుడు ఏ ఇష్యూను తెర మీదకు తీసుకు రావాలి? దాన్ని ఎజెండాగా మార్చాలన్న దానిపై ఆయనకున్నంత క్లారిటీ మరెవరికీ ఉండదన్నది మర్చిపోకూడదు. దళితుల మనసుల్ని దోచుకునేందుకు ఆయన వేస్తున్న ఎత్తులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏడేళ్ల తన పాలనలో ఒక్కసారిగా దళితుల అంశాల్ని తెచ్చిన ఆయన.. వారి కోసం విపరీతంగా తాను తపిస్తున్న భావనను కలుగజేసేలా చేస్తున్నారు. నిజంగానే అంత ప్రేమ ఉండి ఉంటే.. పవర్లోకి వచ్చిన ఈ ఏడున్నరేళ్లు ఏం చేస్తున్నట్లు? అన్నది మరో ప్రశ్న.
గతంలోనూ తాను ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పథకాల మీద ఇలాంటి పరిస్థితినే తీసుకురావటం తెలిసిందే. గొర్రెలకు సంబంధించి కూడా ఇలాంటివెన్నో చెప్పటం మర్చిపోకూడదు. ఉచిత గొర్రెల పంపిణీతో.. రానున్న కొద్ది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎంత ధనిక రాష్ట్రంగా మారుతుందన్న విషయాన్ని గణాంకాలతో వివరించేవారు. మరి.. గొర్రెల పథకం ఏమైంది? తెలంగాణ రాష్ట్రం ఎంత సంపన్నమైనదన్నది అందరికి తెలిసిందే. ప్రస్తుతం దళిత నినాదాన్ని తీసుకున్న సీఎం కేసీఆర్ కు ప్రముఖ న్యాయవాది..హక్కుల నేత దివంగత బొజ్జా తారకం గుర్తుకు వచ్చారు. ఆయన కుమారుడైన ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను సీఎంవో కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎంవోలో మొదటి దళిత అధికారిగా ఇప్పుడు చర్చ జరుగుతోంది.

బొజ్జా తారకం గురించి.. ఆయన గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెబుతున్న కేసీఆర్ కు.. ఇప్పుడే ఆయన గుర్తుకు రావటం ఏమిటి? అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్లకు బొజ్జా తారకం గుర్తుకు రావటమా? మరి.. మానవ హక్కుల గురించి తన ప్రాణాల్ని పణంగా పెట్టి పని చేసిన బాలగోపాల్ కేసీఆర్ కు ఎందుకు గుర్తుకు రావటం లేదు. మేధావితనం.. మంచితనం కులాల వారీగా.. తాను ప్రయారిటీ ఇచ్చే కులానికి సంబంధించిన వారు.. అప్పటి సీజన్ కు తగ్గట్లు గుర్తుకు వస్తారా? అన్నది మరో ప్రశ్న. ఏమైనా.. మహనీయులు.. త్యాగాలకే కేరాఫ్ గా ఉండే మేధావుల్ని తన రాజకీయ ఎజెండాకు అనుగుణంగా వాడేసుకోవటంలో తాను ఎంత దిట్ట అన్న విషయాన్ని సీఎం కేసీఆర్ తాజాగా చెప్పేస్తున్నారని చెప్పక తప్పదు.


Tags:    

Similar News