ఇక్కడ వదిలేసి యూపీకి వెళ్లి ఇరగదీస్తారట!

Update: 2016-10-06 07:26 GMT
తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలు వింటే పొట్ట చెక్కలు కావాల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు.. కాంగ్రెస్ దే అధికారం అంటూ అధినాయకత్వానికి చెప్పి..ఒప్పించి చివరకేం చేశారో అందరికి తెలిసిందే. దశాబ్దాల డిమాండ్ ను సాకారం చేయటంలో పార్టీ అధినేత్రిని ఒప్పించటంలో సక్సెస్ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. తెలంగాణ ప్రజల మనసుల్ని గెలుచుకోవటంలో బొక్కబోర్లాపడ్డారనటంలో సందేహం లేదు. అన్ని సందర్భాల్లోనూ గెలుపు సాధ్యం కాకపోవచ్చు.

కానీ.. ఓటమిని ఒక పాఠంగా తీసుకొని.. తిరస్కరించిన ప్రజల చేత మెప్పుపొందే విషయంలో ఇప్పటికి సరైన ప్రయత్నం చేయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. తాజాగా ఉత్తరప్రదేశ్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. త్వరలో జరిగే యూపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయటానికి వీలుగా.. ఆ రాష్ట్రానికి ప్రయాణమవ్వాలని నిర్ణయించారు.

ఇప్పటికే యూపీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ షురూ చేశారు. నెలల తరబడి సాగే తన పర్యటనలో భాగంగా వివిధ ప్రాంతాల్లోఆయన ఖాట్ భేటీ (సభల్లో మంచాలు వేసి రైతుల్ని కూర్చుబెట్టి మాట్లాడటం)పేరిట సభలు నిర్వహిస్తున్నారు. తమ యువరాజు చేస్తున్న ప్రయత్నాలకు తాము కూడా తోడుగా నిలిచేందుకు వీలుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు యూపీ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు. ఇలావెళ్లటం తప్పేం కాదు.

సమస్యంతా ఎక్కడ వస్తుందంటే.. ఇంటి యవ్వారాల్ని చక్కదిద్దుకోలేనోళ్లు..వీధిలో ఇరగదీసేస్తామని చెప్పుకోవటంలోనే అసలు సమస్య అంతా. తెలంగాణ రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న పలు అంశాల మీద తెలంగాణ ఉద్యమ నేత కోదండరాం లాంటోళ్లు విపరీతమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివాటిని ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా తీసుకెళ్లి.. పార్టీని బలోపేతం చేయాల్సిన వేళ.. ఆ విషయంలో అడ్డంగా ఫెయిల్ అవుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు యూపీకి వెళ్లి పార్టీ తరఫున ప్రచారం చేస్తామని చెప్పటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇల్లు అలకటం చేతకాదు కానీ.. వీధుల్లోఏదేదో చేస్తామని చెప్పటం ఏమిటంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News