కాంగ్రెస్ ఓట‌మి...ఢిల్లీకి ఆశ్చ‌ర్య‌పోయే రిపోర్ట్‌

Update: 2018-12-20 07:07 GMT
తెలంగాణ‌లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన కాంగ్రెస్ పార్టీ త‌న ప‌రాజ‌యంపై స‌మీక్ష చేసుకుంటోంది.  పార్టీ పరాజయంపై అధిష్టానానికి నివేదిక సమర్పించేందుకు టీపీసీసీ కసరత్తు ప్రారంభించింది. అయితే, పార్టీ ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అందుకు భిన్నమైన నివేదిక అధిష్టానానికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇందులో  టీడీపీ - సీపీఐ - టీజేఎస్‌ పార్టీలతో పొత్తులు - సీట్లపై అనేక దఫాలుగా చర్చలు చేయడం - ఆ చర్చల సారాంశాన్ని అధిష్టానానికి పంపించడం - తిరిగి వెంటనే నిర్ణయం రాకపోవడంతో ప్రచారానికి ఆలస్యమైందని - అందుకే పార్టీ ఓటమి పాలైందని ఆ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి పొత్తులు - సీట్లపై అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే పార్టీ ఓడిపోయిందనే కారణాలు చూపుతూ నివేదిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

టీఆర్ ఎస్‌ పై ఉన్న వ్యతిరేకతే తమకు కలిసొస్తుందని - అంతకు మించి తామేమీ చేయాల్సిన అవసరం లేదంటూ ఇన్ని రోజులు బీరాలు పలికారు. పార్టీ నేతల అతివిశ్వాసంతోనే ప్రజలకు, పార్టీ నేతలకు సత్సబంధాలు తెగిపోయాయని - అందుకు టీపీసీసీ అధ్యక్షుడు - రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి మాత్రమే బాధ్యత వహించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమకు అనుకూలమైన నివేదికను సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. టీఆర్ ఎస్‌ ఆకర్ష్‌ వల్ల పార్టీ సంస్థాగతంగా ఎంతో బలహీనపడినప్పటికీ సరిదిద్దే ప్రయత్నం చేయలేదంటున్నారు. క్షేత్రస్థాయిలో వార్డు మెంబర్లు - సర్పంచులు - కౌన్సిలర్లు - కార్పొరేటర్లు - ఎంపీటీసీ - జెడ్పీటీసీలు - ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేలు - ఎంపీల వరకు పార్టీని వీడుతున్నా...రాష్ట్ర నాయకత్వం ఏం పట్టనట్టు వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. అసెంబ్లీ లోపల కూడా ఆశించిన విధంగా పార్టీ వ్యవహరించకపోవడంతో టీపీసీసీ - సీఎల్పీ నేతలు అధికార పార్టీలో కుమ్మక్కైయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రజా సమస్యలపై నిలదీయడంతో ప్రతిపక్ష పార్టీతో విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి. టీఆర్ఎస్‌ కూడా దీన్ని అవకాశంగా తీసుకుని కాంగ్రెస్‌ను ఒక ఆట ఆడుకున్నది. వీటిన్నింటి వల్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని చెబుతున్నారు. పేలవమైన కార్యక్రమాలు - రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేస్తామని ఎన్నికలకు ముందు గొప్పగా చెప్పిన నేతలు...తూ.తూ మంత్రంగా బస్సుయాత్ర నిర్వహించి చేతులు దులుపుకున్నారు.నాలుగు వైపుల నుంచి నలుగురు నేతలు పాదయాత్ర చేస్తారని ప్రకటించి - ఎవరెవరూ పాదయాత్ర చేయాలో తేల్చలేక వెనకడుగు వేశారు. కర్ణుని చావుకు కారణాలెన్నో అన్నట్టు పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నా...కేవలం పొత్తులు - సీట్ల ప్రకటనలు ఆలస్యం కావడం వల్లే ఇలా జరిగిందని తమ తప్పిందాలను కప్పిపుచ్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2014 ఎన్నికల్లో పరాజయంపాలైన కాంగ్రెస్‌...ఆ తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ ఓటమిని చవిచూసింది. ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. గత నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ పడిపోతున్నా...అన్ని ఉప ఎన్నికల్లోనూ పార్టీకి పరాభవం ఎదురైనప్పటికీ గుణపాఠాలు నేర్చుకోలేదని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కూడా ఓటమికి గల కారణాలపై పార్టీ కార్యవర్గం అభిప్రాయాలను తీసుకోకుండా ఉత్తమ్‌ - కుంతియా ఇద్దరే ఏకపక్షంగా నివేదిక తయారు చేస్తున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇంతటి ఘోర వైఫల్యానికి బాధ్యత ఎవరిది? ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం ఏమిటి? పార్టీ నాయకత్వం తీసుకున్న చర్యలేమిటి? ఇత్యాధి కారణాలను తేల్చకుండా పొత్తులు - సీట్ల ప్రకటన ఆలస్యాన్ని సాకుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తద్వారా అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News